Anantapur: అంతా.. డ్రోన్ ఇజం..
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:20 PM
వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేస్తోంది. ఈక్రమంలోనే పురుగు మందులు పిచికారీ చేయడానికి సబ్సిడీపై డ్రోన్‌లు అందజేసింది.
- వ్యవసాయంలో సాంకేతిక విప్లవం.. డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీ
- 5 నిమిషాల్లోనే ఎకరా పొలానికి..
- రైతులకు వరంగా మారిన కిసాన్ డ్రోన్
- భారీ సబ్సిడీతో పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, రాప్తాడు(అనంతపురం)
వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేస్తోంది. ఈక్రమంలోనే పురుగు మందులు పిచికారీ చేయడానికి సబ్సిడీపై డ్రోన్‌లు అందజేసింది. వీటి ద్వారా రైతులు తక్కువ సమయంలో ఎక్కువ పంటకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్క కిసాన్ డ్రోన్ యూనిట్ పూర్తి ధర రూ. 9.8 లక్షలు కాగా రైతు వాటా రూ. 1.96 లక్షలు చెల్లిస్తే మిగిలిన రూ. 7.84 లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది. డ్రోన్ ట్యాంకు 12 లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. విద్యుత్ చార్జింగ్ ద్వారా డ్రోన్ పని చేస్తుంది 40 నుంచి 60 నిమిషాల లోపు డ్రోన్ చార్జింగ్ ఫుల్ అవుతుంది.

ఎకరాకు రూ. 500
ఎకరా పొలానికి మందు పిచికారీ చేసినందుకు ఒక ట్యాంకు నీరు (12 లీటర్ల నీరు, పురుగు మందు) అవసరం. ఎకరాకు పురుగు మందు పిచికారీ చేసినందుకు రైతుల నుంచి రూ. 500 తీసుకుంటున్నారు. కిసాన్ డ్రోన్ ట్యాంకు 12 లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. 12 లీటర్ల నీటిలో పురుగు మందు కలిసి ఒక ఎకరా వరికి 5 నిమిషాల్లోనే మందు పిచికారీ చేయవచ్చు. కిసాన్ డ్రోన్ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం తీసుకెళ్లేందుకు ప్రత్యేక స్టాండ్ అమర్చిన ద్విచక్రవాహనం లేదా ఆటో ఉపయోగిస్తున్నారు.
డ్రోన్ ఆపరేటర్‌గా ఉపాధి
రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలోని అన్నదాత రైతు సేవా సంఘంలోని ఐదుగురు సభ్యులు కలిసి కిసాన్ డ్రోన్ తీసుకున్నారు. రెండు నెలల కిందట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఏఓ కృష్ణ చైతన్య కిసాన్ డ్రోన్‌ను అన్నదాత రైతు సేవా సంఘం సభ్యులకు అందచేశారు. సంఘం సభ్యులు కిసాన్ డ్రోన్ ఆపరేటర్, కో ఆపరేటర్‌ను నియమించి రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని దానిమ్మ, అరటి, చీనీ, వరి, వేరుశనగ, మామిడి వంటి అనేక రకాల పంటలకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ట్రాక్టర్ స్ర్పేయర్లు, తైవాన్ స్ర్పేయర్లు కంటే కిసాన్ డ్రోన్ ద్వారా వేగంగా, సులభంగా మందులు పిచికారీ చేయవచ్చు. చదువుకుని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువకులు డ్రోన్ ఆపరేటర్‌గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతున్నారు.

వేగంగా, సులభంగా..
ఈ ఏడాది రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రతిఏటా వరికి తైవాన్ స్ర్పేయర్ ద్వారా మందు పిచికారీ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. మోకాలు లోతు బురద మడిలో నడిచి మందు పిచికారీ చేయాలంటే కూలీలు రారు. ఈ ఏడాది కిసాన్ డ్రోన్ అందుబాటులో ఉండటంతో రెండు ఎకరాలకు రెండు ట్యాంకులు మందు పిచికారి చేయించా. పది నిమిషాల్లో పని పూర్తయింది. డ్రోన్ వలన వేగంగా, సులభంగా పూర్తయింది. రెండు ట్యాంకులు మందు పిచికారి చేసినందుకు రూ. వెయ్యి చెల్లించా.
- హరినాథ్‌రెడ్డి, రైతు, ఎం. చెర్లోపల్లి
మండలానికి ఒకటి
పురుగు మందులు సులభంగా, వేగంగా తక్కువ ఖర్చుతో పిచికారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధిక శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్ అందజేస్తోంది. ప్రస్తుతానికి మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అన్ని రకాల పంటలకు డ్రోన్ ద్వారా పురుగు మందులు పిచికారీ చేయవచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
- కృష్ణ చైతన్య, ఏఓ, రాప్తాడు
అగ్రికల్చర్ డిప్లొమా చేశా..
హంపాపురం ఆదరణ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేశా. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నా. గుంటూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 10 రోజులు శిక్షణ తీసుకుని ప్రభు త్వ సర్టిఫికెట్ పొందా. ప్రస్తుతం డ్రోన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నా, ఇప్పటి వరకూ 100 ట్యాంకులకు పైగా మందు పిచికారీ చేశా. సంఘం సభ్యులు నాకు నెలకు రూ.15వేలు, సహాయకుడికి రూ.10వేలు జీతం చెల్లిస్తున్నారు.
- వినయ్‌కుమార్ డ్రోన్ ఆపరేటర్, హంపాపురం
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News