Share News

Kommineni: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:58 PM

రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

Kommineni: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..
Kommineni Srinivasa Rao

అమరావతి, జూన్ 10: రాజధాని అమరావతి మహిళలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ (మంగళవారం) ఆయన్ని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో కొమ్మినేనికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవల సాక్షి టీవీలో చర్చా కార్యక్రమంలో రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించలేదు సరికదా.. తాను సైతం ఇటీవల ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలు చదివానంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై రాజధాని అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వారంతా ఆందోళన బాట పట్టారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ సాక్షి యజమాన్యాన్ని నిలదీశారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సాక్షి యూనిట్ల ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే పలువురు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కృష్ణంరాజు, కొమ్మినేనితోపాటు సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా కొమ్మినేనిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఏబీఎన్ చేతికి వచ్చింది. ఇందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

రిమాండ్ రిపోర్టులోని అంశాలు ఇవే..

  • అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం కావాలనే దురుద్దేశంతో చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు.

  • ధీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై ఇటువంటి నిందలు మోపారని.. దీనిపై పూర్తిస్ధాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.


  • సమాజంలో అశాంతి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు నేరపూరిత కుట్రతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే డిబేట్ జరిగిందని.. అదే డిబేట్‌లో వీవీఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ చేశారు.

  • కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను ఖండించక పోవడమే కాకుండా సమర్థిస్తూ మాట్లాడారని.. అంతేకాకుండా తానూ పలు పత్రికల్లో ఈ వార్తలు చూశానని పరోక్షంగా కృష్ణంరాజును ప్రోత్సహించారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.


  • కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలూ బయటకు వస్తాయని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు.

  • తాము విచారిస్తే ఆయన అసలు సహకరించలేదని.. దర్యాప్తు సంస్ధలను తప్పుదోవ పట్టించే విధంగా జవాబులు చెప్పారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.


  • రాష్ట్రంలో శాంతిభద్రతలను భగ్నం చేసేందుకు, అశాంతిని సృష్టించేందుకు చేసిన చర్యగా పోలీసులు అభివర్ణించారు. ఈ కారణంగానే కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్‌కు పంపాలని.. ఈ కేసులో ఇంకా సాక్షులను సైతం విచారించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు.


దిండు, దుప్పటి కావాలి..

కేసు విచారణ సందర్భంగా తన వయస్సు రీత్యా జైలులో మంచం, దిండు ఇప్పించాలని జడ్జిని కొమ్మినేని కోరారు. అయితే జైలు నిబంధనల మేరకే సౌకర్యాలు ఉంటాయని కొమ్మినేనికి జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు కొమ్మినేని తరఫు న్యాయవాది పొన్నవాలు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. కొమ్మినేనిపై అట్రాసిటీ కేసు నమోదుపై డీఎస్పీ‌కు మోమో జారీ చేయాలని జడ్జి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 07:25 PM