Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం..
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:34 PM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం వారు చేసుకుంటున్న పిటిషన్లను కోర్టు కొట్టేస్తోంది. అలాంటి వేళ.. ముఖ్య పరిణామం చోటు చేసుకుంది.
అమరావతి, ఆగస్టు 21: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు, ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రూ. 13 కోట్లతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సెట్ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా ఉన్నట్లు వారు కొనుగోన్నారు. ఈ ఆస్తులను జప్తు చేసేందుకు కొత్త రూల్ మేరకు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి వరకు ఆస్తుల జప్తు ఎంతంటే..?
ఈ మద్యం కుంభకోణంలో నేటి వరకు రూ. 120 కోట్లు మేర ఆస్తులు జప్తు చేసినట్లు అయింది. అందులో 90 శాతం నగదు.. ఈ కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డివే కావడం గమనార్హం. అయితే ఈ రోజు జారీ చేసిన జీవోతో కలుపుకుని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి చార్జిషీట్‌లోనే రూ. 30 కోట్లు ఆస్తులను సిట్ సీజ్ చేసింది. ఆ తర్వాత రెండో చార్జిషీట్‌కు ముందు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు నగదును సిట్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కుంభకోణంలోని నిందితులకు చెందిన వివిధ అకౌంట్లలో సుమారు రూ. 15 కోట్లు స్వాధీన పరుచుకున్నారు. ఇక రాజ్ కసిరెడ్డికి చెందిన వివిధ కంపెనీలు, బినామీ కంపెనీలలో ఉన్న బినామి ఆస్తులను అత్యధికంగా స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు రూ. 90 కోట్లు ఆస్తుల జప్తునకు కోర్టు నుంచి సిట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏం జరిగిందంటే..
జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం వల్ల వేలాది మంది మరణించారు. అలాగే లక్షలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ మద్యం విక్రయ లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో కాకుండా నగదు రూపంలో దుకాణాల్లో వసూల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే.. దీనిపై దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ హామీ ఇచ్చింది. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
అనంతరం ఈ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అదీకాక ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి మీడియా ఎదుట బాంబు పేల్చారు. అలాంటి వేళ.. ఈ మద్యం కుంభకోణంలో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. అయితే గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. సిట్ పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పను సైతం సిట్ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారించారు.
ఈ విచారణలో దాదాపు రూ 3200 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు తేల్చారు. వీరి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మద్యం కుంభకోణం ద్వారా ఈ కేసులో కీలక నిందితుడు ఏ1 రాజ్ కసిరెడ్డి భారీగా నగదు కూడబెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో రూ. 13 కోట్లతో తన పేరు, తన బంధువుల పేరుతో రాజ్ కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆతడి ఆస్తులను జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా పర్యటనలో కవిత.. లేఖ విడుదల
కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం
AP More AP News And Telugu News