BRS MLC Kavitha: అమెరికా పర్యటనలో కవిత.. లేఖ విడుదల
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:27 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను పోరాడుతుంటే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారని కవిత విమర్శించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
వాషింగ్టన్, ఆగస్టు 21: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకంట్ల కవితను ఆ పదవి నుంచి సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలగించారు. ఆమె స్థానంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్‌ను కేటీఆర్ నియమించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అన్నాచెల్లెళ్ల మధ్య పోరు మరింత తీవ్రంగా మారినట్లు అయింది. అయితే కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు గురువారం ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ఏమన్నారంటే..
‘తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది...
అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా...
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు తాను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో తనను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను పోరాడుతుంటే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టాచెమ్మాస్ బంద్ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించాను. కార్మికులు తీసుకునే రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్ లోన్‌పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్‌కు ఉచిత కరెంట్, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను.
కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పది రెట్లు పెంచేందుకు పాటు పడ్డాను. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం తీసుకు వచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను. క్యాడర్ స్కీం, మరణించిన లేదా మెడికల్ అన్ ఫిట్ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాను లేఖ రూపంలో తెలియజేశాను. తన తండ్రిగారైన కేసీఆర్ గారికి తాను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. తాను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి తనపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని తాను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను తాను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్షగట్టారు.
ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే తనపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను.’
ధన్యవాదములతో...
మీ కల్వకుంట్ల కవిత
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం
భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు
For More TG News And Telugu News