Share News

Anjanikumar: కడప సెంట్రల్ జైలులో తనిఖీలు.. ఖైదీల వద్ద సెల్ ఫోన్లు నిజమే

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:41 PM

కడప సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Anjanikumar: కడప సెంట్రల్ జైలులో తనిఖీలు..  ఖైదీల వద్ద సెల్ ఫోన్లు నిజమే
AP Jails DG Anjanikumar

కడప, జులై 29: కడప సెంట్రల్ జైలులో ఖైదీల వద్ద సెల్ ఫోన్ల ఘటనపై విచారణ జరుగుతోందని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం కడపలోని సెంట్రల్ జైలులో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం జైలు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై.. ఈ అంశంపై చర్చించారు. అనంతరం అంజనీ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. జైలులో తనిఖీ నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు వచ్చానన్నారు.


జైలులోని సీనియర్ అధికారులు, వార్డెన్లుతోపాటు సూపరింటెండెంట్‌తో చర్చించామని చెప్పారు. అయితే గత రెండు మూడు నెలల్లో ఇదే జైలులో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఒక ఖైదీ వద్ద సెల్ ఫోన్లను తరచు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. ఈ ఘటనపై కోస్తా జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ విచారణ జరిపి.. నివేదిక అందజేశారన్నారు. ఆ క్రమంలో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. అలాగే ఇదే అంశంపై మరికొంత మంది అధికారులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.


ఇక సెంట్రల్ జైలులో త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. కడప మహిళా ఖైదీలకు స్కిల్ డెవలప్‌మెంట్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుల గురించి అడిగారని చెప్పారు. అదే విధంగా త్వరలో ఈ ములకత్ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు.


ప్రతి జిల్లా కేంద్రంలో యోగ ట్రైనర్లను శిక్షణ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. మదనపల్లిలో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఓటీ కోర్సులను తీసుకు వస్తున్నామని వివరించారు. జైలు నుంచి విడుదలయ్యాక సమాజంలో గౌరవంగా ఉపాధి పొందేలా ఖైదీలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

కడప సెంట్రల్ జైలులో వివిధ కేసులతో వచ్చిన వారే కాకుండా.. ఎర్రచందం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లర్లు సైతం ఉన్నారు. వీరు విలాసవంతమైన జీవితాలు గడిపేందుకు సెంట్రల్ జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోరిన సదుపాయాలన్నీ క్షణాల్లోనే వారికి అందుతాయనే ఒక ప్రచారం సాగుతోంది.


ఫోన్ సదుపాయంతోపాటు ఆహారానికి సంబంధించి.. ఖైదీలు కోరిక మేరకు అన్ని అందుతాయని తెలుస్తుంది. ఈ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ క్రమంలో దీనిపై విచారణ జరపాలని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను ఆదేశించింది. దాదాపు వారం రోజుల పాటు కడప సెంట్రల్ జైలులోని చోటు చేసుకున్న పరిణామాలపై సుదీర్ఘంగా విచారణ జరిపారు.


ఈ విచారణలో ఖైదీలకు ఆహారం, సెల్ ఫోన్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడైంది. అదీకాక ఖైదీలకు సహకరించిన వారంతా జైలులోని ఉన్నతాధికారులని స్పష్టమైంది. దీంతో వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే మరికొందరిపై విచారణ జరుగుతోంది. ఈ నివేదిక అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. విద్యార్థినిని గర్భవతిని చేసిన కరస్పాండెంట్

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ఫైర్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 06:48 PM