Kadapa: జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి.. ఆ జిల్లాను నాశనం చేశారంటూ ఆగ్రహం..
ABN , Publish Date - Feb 04 , 2025 | 06:17 PM
వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కడప: గత వైసీపీ ప్రభుత్వ(YSRCP govt) తప్పిదాలతో ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రవ్యాప్తంగా నేడు ఎక్కడికెళ్లినా సమస్యలు పెద్దఎత్తున కనిపిస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savitha) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రం ఐదేళ్లపాటు అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ (Jagan) తన సొంత జిల్లాను సైతం అభివృద్ధి చేయలేదని, ఇలాంటి వ్యక్తి ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కడప జిల్లా (Kadapa District) పర్యటనకు వచ్చిన మంత్రి సవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి నీటి ప్రాజెక్టు పనులూ ఇప్పుడు చేపడుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు లేని దుస్థితి ఉందని, ఇప్పుడు దాన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీఆర్సీ రివ్యూ సమావేశంలో భూసమస్యలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. భూకబ్జాలకు పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
భూకబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. పాఠశాలలను సైతం కబ్జా చేసి వాటర్ ప్లాంట్లు నిర్మించారని వాటినీ తొలగిస్తామని చెప్పారు. అన్నీ సమస్యలపైనా జిల్లా రివ్యూ మీటింగ్‌లో చర్చించామని, ఎన్నికల హామీ మేరకు చెప్పిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, దశలవారీగా వాటినీ పరిష్క రించుకుంటూ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొత్తపుంతలు తొక్కుతోందని మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Fire Accident: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం
Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై లోక్ సభలో చర్చ.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే..