Andhra Pradesh Agriculture: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Nov 30 , 2025 | 02:14 PM
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వెళ్లి.. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై వివరిస్తున్నారు.
కడప, (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలు సాధారణ పంటలతో పోలిస్తే ఎంతో లాభదాయకమైనవి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి సాగుబడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మరో వైపు నర్సరీల ఏర్పాటు, సబ్సిడీలు, మైక్రో ఇరిగేషన్ పథకాలు, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు సహకారం వంటి చర్యలతో ఉద్యానవన శాఖ రైతులకు అండగా నిలుస్తోంది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన వన పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
రైతన్నా.. మీకోసం..
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వెళ్లి.. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై వివరిస్తున్నారు. డిసెంబరు 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నిరకాల పంటలకు ఆనుకూలమైన వాతావరణం కలిగిన వైఎస్ఆర్ కడప జిల్లాలో 45, 214 హెక్టార్లలో వివిధ రకాల వ్యవసాయ పంటలు, 58,382 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో 25,152 హెక్టార్లలో కూరగాయలు, 8717 హెక్టార్లలో మిరప, 2404 హెక్టార్లలో వివిధ రకాల పూలతోటలు సాగులో ఉన్నాయి. 38, 355 మంది రైతులు 46, 718 ఎకరాల్లో ప్రకృతి సాగు పద్దతులను అవలంబిస్తూ ఆరోగ్యకరమైన కాలుష్య రహిత దిగుబడులు పొందుతున్నారు.
ప్రకృతి సాగులో ఉద్యాన పంటలకు ఆదరణ
ప్రకృతి సాగులో ఉద్యాన పంటలకు ఆదరణ కనిపిస్తోంది. పూల తోటలో చేమంతి, గులాబీ, లిలి, కనకాంబరం, బంతిపూలను విస్తృతంగా సాగు చేస్తున్నారు. పండ్లతోటల పరంగా చూస్తే వేలాది ఎకరాల్లో మామిడి, అరటి, చీనీ, బొప్పాయి, సపోటి వంటి పంటలు కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు. అదే విధంగా వేలాది ఎకరాల్లో ఉల్లి, మిర్చి, ధనియాలు, పసుపు తదితర మసాలా పంటలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. బహుళ పంటలు సాగులోకి తెచ్చి తక్కు వ ఖర్చుతో రసాయనాలు లేని సహజ విధానాల్లో సాగు చేయ డం వంటి అంశాలతో రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయంలో వ్యయాన్ని తగ్గిస్తూ తలసరి ఆదాయం అందుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉద్యానపంటల్లో అంతర పంటలు
ఉద్యాన పంటల్లో అంతర పంటలు సాగు చేసే పద్ధతులను అధికారులు రైతులకు వివరిస్తున్నారు. తోటల సాగు అంటే కేవలం మామిడి, జీడీ, కొబ్బరి మాత్రమే కాకుండా జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లెపూల సాగుతో పాటు ఆయుర్వేద సుగంధ తైల మొక్కల సాగు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ పంటలు తక్కువ నీటితో పెరిగే సామర్థ్యం కలిగి బీడు భూములకు ఎంతో అనువుగా ఉంటాయి. పదే పదే నాట్లు వేసుకునే అవసరం లేకుండా సుదీర్ఘకాలం వరకు ఆదాయం వస్తుంది.
వార్షిక పంటలు వేశాక ఆదాయం రావడానికి రైతుకు సమయం పడుతుంది. దీని నుంచి బయటపడేందుకు కూరగాయలు, బొప్పాయి, అరటితో పాటు పసుపు, అల్లం వంటి అంతర పంటలను పండిస్తే అదనపు ఆదాయం పొంద అవకాశాలు ఉన్నాయి. ఉద్యానవన శాఖాధికారులు స్టాళ్ల ద్వారా రైతులకు సంబంధిత పంటల సాగు, వాటికి ఉపయోగించే మందులు, సేంద్రియ ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు. ఉద్యానవన పంటల సాగుతో పాటు మార్కెట్ డిమాండ్, రకాలు, పెట్టుబడి, లాభం అంశాలు కూడా చర్చించి పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.
ఆరోగ్యకర దిగుబడులు సాధిస్తున్నా...
'మాకున్న మూడు ఎకరాలతో పాటు మా అమ్మగారి రెండు ఎకరాలు కలిపి ఐదు ఎకరాల్లో సహజ పద్ధతిలో పలురకాల ఉద్యాన వ్యవసాయ వంటలు సాగు చేస్తున్నా. వాటికి తోడుగా అంతర పంటలుగా మొత్తం 15 రకాల కూరగాయల సాగు చేస్తున్నా. రసాయనాలు వాడకుండా ఆరోగ్యకర పంట దిగుబడులు అందుకుంటున్నా ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఐసీఆర్పీగా పనిచేస్తూ గ్రామంలోని మరికొంత మంది రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నా ఇటీవల ఇతర దేశాల బృందాలు మా గ్రామానికి వచ్చి మా పంటలు పరిశీలించారు.' అని మూలి లక్ష్మిదేవి అనే మహిళా రైతు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?