Share News

Polavaram Project : సొమ్మూ పాయె.. కాలమూ వృథా

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:13 AM

జగన్‌ నిర్వాకాలకు పోలవరం ప్రాజెక్టును బలిపెట్టారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పనీచేయకుండా.. కట్టినవాటినే ధ్వంసం చేసేశారు.

Polavaram Project : సొమ్మూ పాయె.. కాలమూ వృథా

  • జగన్‌ నిర్వాకంతో నిలిచిపోయిన పోలవరం

  • అదనపు పనుల పేరిట 2.269 కోట్ల భారం

  • పూర్తయిన డయాఫ్రం వాల్‌పై ఈసీఆర్‌ఎఫ్‌ కట్టకుండా కాలయాపన

  • వరదలకు అది ధ్వంసమై కొత్తది కట్టాల్సిన పరిస్థితి

  • మరో 980 కోట్ల అనవసర ఖర్చు

  • కాఫర్‌ డ్యాంలలో సీపేజీ కుంగిపోయిన గైడ్‌బండ్‌

  • మళ్లీ చంద్రబాబు వచ్చాకే ప్రాజెక్టులో కదలిక

  • జోరుగా వాల్‌ నిర్మాణ పనులు

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అబద్ధానికి రంగులు వేసి అదే సత్యమని ఎలా ప్రచారం చేయాలో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారు. తన నిర్వాకాలకు పోలవరం ప్రాజెక్టును బలిపెట్టారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పనీచేయకుండా.. కట్టినవాటినే ధ్వంసం చేసేశారు. కేంద్రం వద్దని మొత్తుకున్నా.. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. రూ.628 కోట్లు ఆదాచేశామని ఘనంగా ప్రచారం చేసుకుని.. ఆనక అంచనాలు పెంచేశారు. అదనపు పనుల పేరిట రూ.2,269 కోట్ల భారం మోపారు. ఇంతాచేసి ప్రాజెక్టును పూర్తిచేయకపోగా..కోలుకోలేని రీతిలో ధ్వంసంచేశారు. విలువైన ఐదేళ్ల కాలాన్ని వృథా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. కీలకమైన డయాఫ్రం వాల్‌ పనులు పరుగులు తీస్తున్నాయి.

2021లో పూర్తయి ఉంటే..

2019లో ఆదరాబాదరాగా కాంట్రాక్టు సంస్థను మార్చేసిన జగన్‌.. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనీ చేయలేదు. తరచూ గడువులు పెంచుకుంటూ పోయారు. ఆయనే చెప్పినట్టు 2021 డిసెంబరులోనే అది పూర్తయి ఉంటే రాష్ట్రంలో కొత్తగా 7లక్షల ఎకరాలకు నీరంది ఉండేది. ఎడమ కాలువను పూర్తిచేసి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం జిల్లా చివరి ఆయకట్టుదాకా గోదావరి జలాలు పారేవి. కృష్ణా డెల్టాకూ అందేవి. ఫలితంగా కృష్ణా జలాలను రాయలసీమలో పెద్దఎత్తున వాడుకునేందుకు వీలుండేది. కానీ జగన్‌ వీటన్నిటికీ గండికొట్టారు. కాంట్రాక్టు సంస్థను తొలగించి.. ప్రధాన డ్యాంలో మిగిలిన రూ.1,771 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు.


కొత్త కాంట్రాక్టు సంస్థకు రివర్స్‌ టెండర్‌లో రూ.1,548.12 కోట్లకు పనులు అప్పగించారు. దీనివల్ల రూ.628 కోట్లు ఆదాచేశామని డబ్బాకొట్టుకున్నారు. అయితే గప్‌చు్‌పగా అంచనాలు పెంచేశారు. అదనపు పనులు సృష్టించి మొత్తం పనులను రూ.2,268.68 కోట్లకు అప్పగించారు. అంటే రూ.720.56 కోట్ల అదనపు భారం వేశారు. పోనీ భారం మోపినా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేశారా అంటే.. ఐదేళ్ల విలువైన కాలం వృథాచేసి.. మరింత సంక్షోభంలోకి నెట్టారు. గతంలో చంద్రబాబు హయాంలోనే పూర్తయిన డయాఫ్రంవాల్‌పై ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మించకుండా జగన్‌ నిర్లక్ష్యం చేశారు. దీంతో 2019, 20ల్లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు వాల్‌ దెబ్బతింది. ఫలితంగా రూ.980 కోట్ల అదనపు భారంతో కొత్త వాల్‌ నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల కిందటే ఎట్టకేలకు దీని పనులు మొదలై ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇంకోవైపు.. జగన్‌ జమానాలో నిర్మించిన గైడ్‌బండ్‌ అప్పుడే కుంగిపోయింది. నిర్మాణ జాప్యం కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. వాటిలో పెద్దఎత్తున సీపేజీ వస్తోంది. వీటి మరమ్మతులకూ అదనంగా ఖర్చుకానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:13 AM