Share News

Tenali: అన్నీ అబద్ధాలే

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:04 AM

జగన్‌ హయాంలో తెనాలిలో రౌడీషీట్లపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వీరి దాడులతో దళితులు, మైనారిటీలు బాధపడుతున్నారని ఆర్టికల్‌ వెల్లడిస్తుంది. జగన్‌ వారి మద్దతు ఇస్తున్నారని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 Tenali: అన్నీ అబద్ధాలే

  • ఆ రౌడీషీట్ల కథ జగన్‌కు ఎరుకే ఆయన హయాంలోనే రాకేశ్‌, విక్టర్‌పై నమోదు

  • ఒక్కొక్కరిపై తొమ్మిది, పది క్రిమినల్‌ కేసులు

  • అందులో చాలావరకు వైసీపీ హయాంలోవే..

  • దళితులు, మైనారిటీలూ వీరి బాధితులే

  • ఐతానగర్‌ కేంద్రంగా కొన్నేళ్లుగా రౌడీరాజ్‌..

  • అలాంటివారికి ‘అమాయకుల’ని సర్టిఫికెట్‌

  • జరిగిన ఘటనను వక్రీకరించి నయా కహానీ..

  • అలాంటివారి పరామర్శకు పనిగట్టుకుని తెనాలికి..

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

‘‘పోలీసులు లాఠీ కౌన్సెలింగ్‌ ఇచ్చాకే వీరందరిపై రౌడీషీట్‌లు తెరిచారు’’... అని తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్‌ సెలవిచ్చారు. అయితే, ఈ మాటలు పచ్చి అబద్ధాలు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. జగన్‌ మంగళవారం తెనాలిలో మద్దతుగా మాట్లాడిన రౌడీషీటర్లలో దోమా రాకేశ్‌, జాన్‌ విక్టర్‌లపై రెండేళ్ల క్రితం, ఆయన హయాంలోనే రౌడీ షీట్లు తెరిచారు. మరో ముద్దాయి వేమా నవీన్‌పై చాలా సంవత్సరాలుగా రౌడీషీట్‌ ఉంది. ఇతణ్ణి ‘కిల్లర్‌’ అని పిలుస్తారు. వీరందరిపైనా ఆరు నుంచి పది వరకు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెనాలిలోని ఐతానగర్‌ అడ్డాగా దళితులు, ఇతర వర్గాలపై హంతక దాడులు, దౌర్జన్యాలు, ఎత్తుకెళ్లి చిత్రహింసలు, గంజాయి, దారిదోపిడీలు చేసిన భయంకర నేరచరిత్ర ఉన్న రౌడీషీటర్లు వీళ్లు. తెనాలిలోని అన్ని వర్గాలూ వీరి బాధితులే. ఎస్సీలు, మైనారిటీలు అతి ఎక్కువగా దాడులకు గురయ్యారు. అందువల్లే జగన్‌ తెనాలి పర్యాటనను అడ్డుకుంటూ ప్రధానంగా ఈ వర్గాలే నిరసనల్లో పాల్గొన్నాయి. అలాంటివారి పరామర్శకు పనిగట్టుకుని జగన్‌ తెనాలికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీషీటర్ల నేర చరిత్ర, కేసుల వివరాలివీ.. చేబ్రోలు జాన్‌ విక్టర్‌పై 2023 జూలై 9న సస్పెక్టడ్‌ షీట్‌ తెరిచారు. ఆయన నేర చరిత్ర 2017లోనే మొదలైంది. జగన్‌ పాలించిన 2019-2024 మధ్యకాలంలో మరింతగా రెచ్చిపోయాడు. అప్పట్లో అతనిపై 4కేసులు నమోదయ్యాయి. గత జనవరిలో సస్పెక్టడ్‌ షీట్‌ను రౌడీషీట్‌గా మార్చారు. విక్టర్‌ పై 10 కేసులు ఉన్నాయి.


మరో రౌడీషీటర్‌ దోమా రాకేశ్‌పై 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయంలో 5 కేసులు నమోదయ్యాయి. రాకేశ్‌పై 9 కేసులున్నాయి. హత్యాయత్నం, దారిదోపిడీలు, దొంగతనాలు తదితర కేసుల్లో నిందితుడు. మరో రౌడీషీటర్‌ వేమా నవీన్‌ అలియాస్‌ కిల్లర్‌పై జగన్‌ హయాంలోనే 6 కేసులు నమోదయ్యాయి. ఇలాంటివారిని ఉద్దేశించి ‘అమాయకులు’ అని జగన్‌ మద్దతుగా మాట్లాడటం వైసీపీ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.

జగన్‌ మార్క్‌ కహానీ..

దోమా రాకేశ్‌, జాన్‌ విక్టర్‌, కరీముల్లా ఐతానగర్‌ లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కానిస్టేబుల్‌ చిరంజీవి సివిల్‌ డ్రెస్‌లో ఎవరితోనోగొడవ పడటం చూసి అడ్డుకోగా, వారి ఫోన్లు, బండి తాళాలు కానిేస్టబుల్‌ తీసుకున్నారని జగన్‌ సెలవిచ్చారు. కానీ, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఆ ముగ్గురే ఇంటికి వెళుతున్న కానిేస్టబుల్‌ చిరంజీవిని చుట్టుముట్టి కొట్టారు. సివిల్‌ డ్రస్సులో కానిస్టేబుల్‌ ఉండటంతో గుర్తించలేదని తప్పించుకోడానికి వీలు కూడా లేదు. ఎందుకంటే ముద్దాయిల్లో ఒకడైన రాకేశ్‌, కానిస్టేబుల్‌ ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటన తర్వాత ఏప్రిల్‌ 25న పోలీసులు మంగళగిరి వెళ్లి విక్టర్‌ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారని జగన్‌ చెప్పింది కూడా అబద్ధమే. ఈ కేసులో నిందితులను తెనాలిలోని రామలింగేశ్వరరావు పేట సెంటర్లలో అదే నెల 27న అరెస్ట్‌ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆదేరోజు వారిని కోర్టులో హాజరుపరిచి రేపల్లె జైలుకు తరలించారు. వాస్తవం ఇది కాగా, మూడు రోజులు పోలీస్‌ ేస్టషన్లో, పోలీసుల అదుపులో వారిని ఉంచుకున్నరనీ, విక్టర్‌ జేబులో పోలీసులే కత్తి పెట్టి మధ్యవర్తుల సమక్షంలో పంచనామా రాశారని జగన్‌ సెలవిచ్చారు. వాళ్ల శరీరంపై దెబ్బలు ఉన్నాయనేదీ తప్పుడు కథనమే. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందుగా ముగ్గురినీ పరీక్షించిన వైద్యులు వారి ఒంటిపై ఎలాంటి దెబ్బలు లేవని సర్టిఫికెట్‌ ఇచ్చారు.


ఐతానగర్‌ అడ్డాగా ఆగడాలు....

తెనాలిలోని ఐతానగర్‌ అడ్డాగా రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. ఒకవైపు గంజాయి దందా! మరోవైపు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, మహిళలపై వేధింపులు! ఇలా ఐదేళ్లుగా వీళ్ల ఆగడాలు శ్రుతిమించాయని స్థానికులు వాపోతున్నారు. వీరి బాధ పడలేక అక్కడ అద్దెకు ఉంటున్న వారిలో చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. తమపై గంజాయి, మద్యం మత్తులో అల్లరిమూకలు ఎక్కడ దాడిచేస్తారో అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రాత్రిసమయాల్లో రోడ్లపై బైకులపై విచ్చలవిడిగా తిరుగుతూ, ఎదురు తిరిగిన వారిపై దాడులు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ ఆగడాలను ప్రశ్నించిన కానిేస్టబుల్‌ చిరంజీవిపై రాకేశ్‌, విక్టర్‌, నవీన్‌, కరీముల్లా దాడి చేశారు. తోమటి ప్రశాంత్‌ అనే రౌడీ షీటర్‌ మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలికి అండగా నిలిచాడని ఆమె సొంత మామను హత్యచేశాడు. వివాహేతర సంబంధం ఉన్నదనే అనుమానంతో మాదిగ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని సముద్రాల పవన్‌ కుమార్‌ అలియాస్‌ లడ్డూ అనే రౌడీషీటర్‌ అత్యంత పాశవికంగా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆ ముక్కలను గోనె సంచిలో మూటకట్టి కాలువలో పడేశాడు. తెనాలి పట్టణంలో రౌడీషీటర్‌లు వీరయ్యపై 12, సురేంద్రపై 3 కేసులు ఉన్నాయి. ఆయా రౌడీషీటర్ల అనుచరులుగా ఉంటూ వారి నీడలో పెరిగిన లడ్డూ గ్యాంగ్‌ ఇప్పుడు సామాన్యులపై దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ రౌడీమూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను, ప్రజలను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. కాగా, జగన్‌ తెనాలి పర్యటనలో వైసీపీ మూకలు వీరంగం సృష్టించాయి. ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఏఆర్‌ పోలీస్‌ వాహనంపైకెక్కి ఓ యువకుడు ఊగిపోతూ చిందులు తొక్కాడు. శివాలెత్తినట్టు మత్తులో తూగుతూ హల్‌చల్‌ రేపారు. వైసీపీ ర్యాలీలో యువకులు బైక్‌లకు సైలెన్సర్‌లు తీసేసి భారీ శబ్దాలతో హడలెత్తించారు. రాకేశ్‌ నివాసం దగ్గరకు జగన్‌ వెళ్లినప్పుడు, అది చిన్న సందు కావటంతో తోపులాట జరిగింది. బయట నిలబడిన మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, అంబటి రాంబాబు, వైసీపీ నేత అప్పిరెడ్డిపైకి జనం తోసుకుంటూ వచ్చేశారు. అప్పిరెడ్డి పక్కకు దూకేయగా, నాని, రజిని కిందపడిపోయినంత పనయింది. అయితే వారిపై స్థానికులు దాడి చేశారంటూ సోషల్‌ మీడియాతో వదంతులు వైరల్‌ అయ్యాయి.

Updated Date - Jun 04 , 2025 | 04:08 AM