Visakhapatnam: విశాఖ సిగలో అద్దాల వంతెన..
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:31 AM
పర్యాటకులకు విశాఖపట్నంలో మరో ఆకర్షణ తోడయ్యింది. ఇప్పటి దాకా విదేశాల్లో మాత్రమే చూసిన అద్దాల వంతెనపై నడక అనుభవాన్ని ఇక నుంచి మనమూ పొందొచ్చు. దేశంలోనే అతి పొడవైన ‘స్కై గ్లాస్ బ్రిడ్జ్’ని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిర్మించింది.
విశాఖలోని కైలాసగిరిపై ‘టైటానిక్ పాయింట్’ పర్యాటకులకు సుపరిచితమే. అక్కడి నుంచి కొండ ఏటవాలు ప్రాంతంలో... సముద్రం వైపు 55 మీటర్ల పొడవున గ్లాస్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ఇది భూమి నుంచి 862 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం నుంచి వేయి అడుగుల ఎత్తులో ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ దృఢంగా నిలబడేందుకు కింద క్యాంటీలీవర్ ఏటవాలుగా నిర్మించారు. దీనికి సముద్రపు గాలులకు తుప్పు పట్టని స్టీల్‌ను 40 టన్నులు ఉపయోగించారు. ఇప్పటివరకూ కేరళలోని వాగమన్‌లో నిర్మించిన 38 మీటర్ల గ్లాస్ బ్రిడ్జే దేశంలో అతి పొడవైనది. దానికి మించి విశాఖపట్నంలో 55 మీటర్ల పొడవున నిర్మించారు. చదరపు మీటరుకు 500 కిలోల బరువును తట్టుకునే అద్దాలను దీనికోసం వినియోగించారు. ఈ గ్యాస్ ప్యానెళ్లను జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.

ఒక విడతకు 40 మంది...
ఒత్తిడి తట్టుకునేందుకు మూడు లేయర్లలో 40 ఎంఎం టాంపర్డ్ గ్లాస్‌ను లామినేట్ చేసి ఉపయోగించారు. వంద మంది ఒకేసారి ఎక్కినా చెక్కు చెదరనంత బలంగా నిర్మించారు. అయితే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌పైకి ఎక్కితే ఎదురుగా గంభీరమైన సముద్రం, తీరాన్ని తాకేందుకు ఎగిసి పడే అలలు కనిపి స్తాయి. చుట్టూ ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి కిందికి చూస్తే... అంతా లోయ. పైగా గాజుపై ఉండటంతో భయంతో కూడిన థ్రిల్ ఉంటుంది. మధ్యలోకి వెళ్లి ఎవరైనా భయపడితే... వారికి భరోసాగా ఉండడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.
తుఫాన్లను తట్టుకునేలా...
బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తే... విశాఖపట్నంపై తప్పనిసరిగా వాటి ప్రభావం ఉంటుంది. హుద్‌హుద్ తుఫాన్ కైలాసగిరి వద్దనే తీరాన్ని దాటింది. ఆ ప్రభావానికి కైలాసగిరి చాలావరకు దెబ్బతింది. తిరిగి పూర్వపు రూపం తీసుకురావడానికి చాలాకాలం పట్టింది. ఈ నేపథ్యంలో గంటకు 250 కి.మీ. వేగంతో వీచే తుఫాన్ గాలులను కూడా తట్టుకుని నిలిచే విధంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఏడు కోట్ల రూపాయలు వెచ్చించారు. ‘ఎస్‌ఎస్‌ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ’ వీఎంఆర్‌డీఏతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చింది.
- యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం
ఫొటోలు: వై.రామకృష్ణ
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Read Latest Telangana News and National News