Share News

High Court Bench in Kunool: కర్నూలులో బెంచ్‌‌ ఏర్పాటు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్

ABN , Publish Date - Feb 04 , 2025 | 06:19 PM

High Court Bench in Kunool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయింది. ఈ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేశారు.

High Court Bench in Kunool: కర్నూలులో బెంచ్‌‌ ఏర్పాటు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
AP High Court

అమరావతి, ఫిబ్రవరి 04: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాంటి వేళ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాదులు తాండవ యోగేష్‌తోపాటు తురగా సాయి సూర్య దాఖలు చేశారు. ఈ పిల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితోపాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా న్యాయవాదులు చేర్చారు.

జస్వంత్ సింగ్ కమిషన్ నివేదికను పరిశీలనలోకి తీసుకోకుండా ఈ హైకోర్టు బెంచ్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ సదరు పిల్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. అదే విధంగా భావోద్వేగాలు, రాజకీయ అంశాలను పరిశీలనలోకి తీసుకుని హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం న్యాయ, రాజ్యాంగ విరుద్దమంటూ వారు ఈ పిటిషన్‌లో స్పష్టం చేశారు. అదికాక.. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31‌కు ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని తెలిపారు.


రాజధాని అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సైతం ఇది వ్యతిరేకమని ఆ పిల్‌లో న్యాయవాదులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒకే ఒక్క సీటు ఉండాలని పునర్వ్యస్థీకరణ చట్టంలో ఉందని ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తు చేశారు. వర్చువల్ హియరింగ్స్, ఈ పైలింగ్స్ వచ్చిన అనంతరం ఇంకా బెంచ్‌లు ఏర్పాటు చేయడం తగదంటూ సదరు పిల్‌లో వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిల్‌లో న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ పిల్‌‌ను బుధవారం విచారించే అవకాశముందని తెలుస్తోంది.

Also Read: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ


మరోవైపు తాము అధికారంలోకి వస్తే.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నేరవేరుస్తోంది. అందులోభాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకే ఇటీవల చర్యలు చేపట్టింది.

Also Read: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం


అందులోభాగంగా వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇంకోవైపు అందుకు సంబంధించిన పురోగతిపై రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ జిల్లా ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో మరికొద్ది రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నారు.

Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన


ఇక గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ క్రమంలో కర్నూలును న్యాయ రాజధానిగా ఆయన ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన అయితే చేశారు. కానీ. ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేదు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.

For AndhraPradesh news And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 06:26 PM