Next Three Days Heavy Rains: మళ్లీ భారీ వర్షాలు.. ప్రజలకు కీలక సూచనలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 07:44 PM
మళ్లీ వరుసగా మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అమరావతి, ఆగస్టు 16: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహాణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సూచన మేరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే వీటితో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచించింది. అలాగే ఈదురు గాలులతోపాటు భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, శిథిలావస్థలోనున్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండ వద్దని ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది. అదే విధంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇక అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
సోమవారం అంటే ఆగస్టు 16.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.