Share News

Weather Alert: ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు..

ABN , Publish Date - Aug 12 , 2025 | 08:05 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ ప్రకారం.. బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 - 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Weather Alert: ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు..
Weather Alert

అమరావతి, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ ప్రకారం.. బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 - 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం నాడు పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.


గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవొద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

రానున్న రెండు రోజులు వాతావరణం ఎలా ఉండనుంది..? విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఏం చెప్పారు.. పూర్తి వివరాలు చూద్దాం..


బుధవారం నాడు అంటే 13-08-2025 తేదీ నాడు పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం(14-08-25) నాడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే.. మంగళవారం సాయంత్రం నాడు ఇవాళ 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా మద్దిపాడులో 93 మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 76మిమీ, సామర్లకోటలో 72.2మిమీ, అల్లూరి జిల్లా కరిముక్కిపుట్టిలో 68మిమీ, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 59.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.


Also Read:

2030 కల్లా ప్రపంచం నుంచి క్యాన్సర్ కనుమరుగు

భారీ ఎక్సర్‌సైజులు చేయకపోయినా మంచి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 12 , 2025 | 08:05 PM