Kesineni Chinni Vs Kolikipudi Srinivasarao: క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయితీ..
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:10 PM
మరికొన్ని గంటల్లో తిరువూరు పంచాయితీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు రాబోతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు వేర్వేరుగా ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు.
అమరావతి, నవంబర్ 03: విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తిరువూరు పంచాయితీ మంగళవారం క్రమ శిక్షణ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏమి జరుగుతుందోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది. మంగళవారం ఉదయం 11.00 గంటలకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు.. సాయంత్రం 4.00 గంటలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని క్రమశిక్షణ కమిటి ముందు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వివరాలను వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ అడిగి తెలుసుకోనుంది.
2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు,విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని బరిలో నిలిచి గెలిచారు. అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే తిరువూరు నియోజకవర్గం సైతం ఉంది. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కొలికిపూడి వ్యవహారశైలిపై తిరువూరు నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నేతలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనపై పలుమార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో పద్దతి మార్చుకోవాలంటూ కొలికిపూడికి అధిష్టానం పలుమార్లు సూచించింది.
అయినా తిరువూరు ఎమ్మెల్యే మాత్రం తన పద్దతి మార్చుకో లేదు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ కేశినేని చిన్నికి తాను భారీగా నగదు ఇచ్చానంటూ కొలికిపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇంకోవైపు ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేకంగా పని చేయడం, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ ఇప్పటికే పలుమార్లు కేడర్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అలాంటి వేళ.. నవంబర్ 4వ తేదీన ఈ క్రమ శిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలంటూ ఇప్పటికే వీరిద్దరికి ఆదేశాలు అందాయి. దాంతో క్రమశిక్షణ కమిటీ ఎదుట వీరిద్దరు వేర్వేరుగా హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన అమరావతికి తిరిగి వచ్చే సరికి నివేదికను సిద్ధం చేసేందుకు క్రమశిక్షణ కమిటీ సన్నాహాకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మల్కాపురంతో రాణి రుద్రమ్మకు అనుబంధం
16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: నారా లోకేశ్
Read Latest AP News And Telugu News