Share News

Rani Rudramadevi Historic Connection To Amaravati: మల్కాపురంతో రాణి రుద్రమ్మకు అనుబంధం

ABN , Publish Date - Nov 03 , 2025 | 09:34 PM

ఓరుగల్లును ఏలిన కాకతీయ మహారాణి రాణి రుద్రమ్మ దేవికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో అనుబంధం ఉంది. రాజదాని ప్రాంతంలోని మల్కాపురం ఆమెకు మనస్సుకు నచ్చని గ్రామమని చెబుతున్నారు. ఆ గ్రామంలో రాణి రుద్రమ్మ దేవి వేయించిన శిలా శాసనాలు సైతం నేటికి దర్శనమిస్తున్నాయి.

Rani Rudramadevi Historic Connection To Amaravati: మల్కాపురంతో రాణి రుద్రమ్మకు అనుబంధం
Rani Rudramadevi

శౌర్యానికి.. ధైర్యానికి ప్రతీకగా నిలిచే రాణి రుద్రమదేవి అంటే నేటికీ తెలుగునాట ఘనకీర్తి. రాజధాని అమరావతితో కాకతీయల రాణికి ప్రత్యేక అనుబంధం ఉంది. అమరావతి భూభాగంలో ఆమె ఎన్నోసార్లు నడయాడారు. కాకతీయ సామ్రాజ్యం పాలనా పగ్గాలను చేపట్టడానికి ముందు నుంచే రుద్రమదేవి తండ్రి గణపతి దేవునితో కలిసి తరచుగా మల్కాపురం వచ్చి పోతుండే వారు. ఈ ప్రాంతంలోని ఓ కొలనంటే ఆమెకు ఎంతో మక్కువ. ఆ కొలను ఒడ్డున కూర్చొని సేదతీరేవారు. ఈ ప్రాంతంపై తనకున్న ప్రేమాభిమానాల కొద్దీ ఆమె తన జన్మదినోత్సవాన్ని ఇక్కడే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక్కడి మహిళల గర్భకోశ వ్యాధుల చికిత్సల కోసం ఏకంగా ఓ ప్రసూతి వైద్యశాలనే ఆమె కట్టించారు. రాణీ రుద్రమదేవిని అంతగా ఆకట్టుకున్న ఆ ప్రదేశమే నేటి మల్కాపురం. రుద్రమదేవి తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఆనవాళ్లు నేడు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని పట్టించుకునేవారు లేరు. ఘన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, రుద్రమదేవి తాలూకు ఆనవాళ్లను పరిరక్షించి దీనినో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


మంగళగిరి, ఆంధ్రజ్యోతి: రుద్రమదేవి చరిత్ర తెలంగాణకే కాదు.. యావత్ తెలుగు ప్రాంతానికంతా సుపరిచితమే. వరంగల్ కేంద్రంగా ఆమె పాలన కొనసాగినప్పటికీ నేటి రాజధాని అమరావతి ప్రాంతం కూడా అప్పట్లో ఆమె ఏలుబడి లోనిదే. రుద్రమదేవి తండ్రి గణపతిదేవుని కాలం నుంచే ఈ ప్రాంతంలో కాకతీయులకు అనుబంధం ఉండేది. తనకు రాజగురువుగా కొనసాగిన విశ్వేశ్వర శంభు అనే శివాచార్యునికి ఈ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చారు గణపతిదేవుడు. రాయపూడి మొదలు పెనుమాక వరకు ఉన్న పదికి పైగా గ్రామాలను ఈ విశ్వేశ్వరశంభుకు అప్పగించారు.


నాలుగు గొప్ప రాజవంశాలకు రాజగురువుగా ఆయన వ్యవహరించారు. కృష్ణానది ఉత్తరవాహినిగా ఉన్న ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి విశ్వేశ్వరశంభుకు అప్పగించారు. మల్కాపురంలో విశ్వేశ్వరశంభు గోళకేమరాన్ని స్థాపించారు. గోళకే మరం అంటే శివాలయం వేదవిద్యతో కూడిన మహా విద్యాలయ సముదాయం. అప్పట్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల సందర్భంగా పదిమంది నృత్యకళాకారిణులు నాట్యం చేస్తుండే వారు. 14 మంది మహిళా గాయకురాళ్లు, వివిధ రకాల వాయిద్యాలను వాయిస్తూ మరో 16 మంది సంగీత కళాకారులు ఉండేవారు.


అర్చనల నిమిత్తం ఆరుగురు, ఆలయ నైవేద్యాల కోసం మరో ఇద్దరు బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఉండేవారు, వీరభద్రుల పేరిట పది గ్రామాలను సంరక్షించడానికి 73 మందితో కూడిన ప్రత్యేక సైనికదళం (మిగతా 7లో) ఘనకీర్తికి మారుపేరుగా మందడం, మల్కాపురం సజీవ శిలాజాలుగా శివాలయం, నందిశాసనం, కోనేరు పర్యాటక ప్రాంతంగా ప్రజల వేడుకోలు మల్కాపురంలో రాయ గజకేసరి రాణీ రుద్రమదేవి వేయించిన శిలాశాసనం ఉండేది. ఆలయ నిర్వహణలో పాలుపంచుకునే వారిని కశ్మీర్, తమిళనాడు నుంచి విశ్వేశ్వరశంభు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇలా శివాలయం అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ఇది నేడు గర్భాలయం వరకే పరిమితమై కనిపిస్తుంది.


ఆక్రమణల మధ్య ఆనవాళ్లు మాయం..

కాకతీయుల అనంతరం జరిగిన ముస్లింల దాడుల నేపథ్యంలో గోళకేమరం దెబ్బతింది. ఆలయ మండపాలతో పాటు గర్భగుడిలోని శివలింగాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత అగ్రహారంగా ఉన్న ఈ ప్రాంతమంతా కాలగతిలో ఆక్రమణలగురైంది. ఆలయం, రుద్రమదేవి శిలాశాసనం కూడా కనిపించనంతగా గృహాలు పుట్టుకొచ్చాయి. ఆలయానికి దక్షిణంగా 20 సెంట్లు, పడమరగా 16 సెంట్లు మాత్రమే మిగిలి ఉంది.


ఆలయాన్ని రాష్ట్ర దేవదాయశాఖ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతూ గ్రామస్థులు ప్రభుత్వానికి ఆర్జీల రూపంలో విన్నవించుకున్నారు. డాక్టర్ భవానీ అనే వైద్యురాలు ఇటీవల ఈ ఆలయ చరిత్రను తెలుసుకుని.. తన బంధుమిత్రుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే ఆలయం చుట్టూ వున్న 33 గృహాల వారు అందుకు అభ్యంతరాలను తెలిపారు.


దీంతో ఆమె ఏమి చేయ లేక నిస్సహాయురాలిగా ఉండిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018లో ఈ ఆలయాన్ని సందర్శించారు. అయినా అభివృద్దిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మందడం, తుళ్లూరు ఆర్అండ్ బీ రోడ్డు వెంబడి ఉన్న రుద్రమదేవి నిర్మించిన చెరువు కూడా మూడు వైపులా ఆక్రమణలు పెరిగిపోయాయి.


2011 నుంచే మళ్లీ పూజాదికాలు

గోళకేమరం స్పూర్తితే విజయవాడకు చెందిన శివస్వామి మందడం శివారులోని కృష్ణానది వెంట తాళ్లాయపాలెంలో శైవక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. మల్కాపురంలో అరకొర గోడలతో సజీవ శిలాజం మాదిరిగా మిగిలి ఉన్న గర్భగుడిలో 3011 చిన్న శివలింగాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాటు చేశారు. ఇందుకు ఆలయం ఎదురుగా ఉన్న షేక్ అరుణ అనే మహిళ ఆర్థిక సహకారాన్ని అందించారు. ములకల ఆదినారాయణ అనే పూజారి గత ఏడాదిగా స్వచ్చందంగా ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తున్నారు.


ఘనంగా రుద్రమా జయంత్యుత్సవం

1261 మార్చి 25న రుద్రమదేవి తన జన్మదినోత్సవాన్ని మల్కాపురంలోని గోళకేమరంలో ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివాలయానికి తూర్పు దిక్కుగా ఓ భారీ శిలాశాసనాన్ని వేయించారు. అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. దీనిని నంది శాసనమమని, నాగశాసనమని వ్యవహరిస్తుంటారు. ఈ శాసనంపై ఆలయం వైపు నంది విగ్రహం.. మరోవైపు పడగవిప్పి సర్పం చెక్కబడి ఉండటమే. ఇందుకు కారణం.


దీనిపై వాటి జయంత్యుత్సవాల నిర్వహణ, చేసిన దానాల గురించి విపులంగా తెలుగు, సంస్కృత భాషల్లో లిఖించారు. ఈ సందర్భంలోనే రుద్రమదేవి ఆలయానికి తూర్పు ఈశాన్యంగా ఓ కోనేరును తవ్వించడంతోపాటు మందడం పరిధిలో ఓ ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేయించారు. అప్పట్లో గర్భిణులు సుఖప్రసవాలు లేక మృత్యువాత పడటాన్ని చూసి రుద్రమదేవి ఎంతగానో చలించిపోయారు. ఆ క్రమంలో ఈ ప్రసూతి వైద్యశాలను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయించారు.


ఈ ప్రస్తావన కూడా శాసనంలో ఉంది. తాను సామ్రాజ్ఞిగా పట్టాబిషిక్తురాలైన తర్వాత కూడా రుద్రమదేవి ఇక్కడికి ఎన్నోమార్లు వచ్చారు. తాను నిర్మించిన కోనేరు ఒడ్డున కూర్చొని సేదతీరుతుండడం ఆమెకు ఇష్టమైన అలవాటుగా ఉండేదంటారు. 1289లో జరిగిన ఓ మహాసంగ్రామంలో రుద్రమదేవి వీరమరణం పొందిన తర్వాత కూడా చాలాకాలం ఈ ప్రాంతం గొప్పగానే వెలుగొందుతూ వచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి

క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయతీ..

16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 09:39 PM