Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులను సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 09:44 PM
మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
నెల్లూరు, డిసెంబర్11: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు అతడి సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల కోర్టులో గురువారం లొంగిపోయారు. వారికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దాంతో వీరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.
2025, మే 24వ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకట్రావు, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులు సవాలు చేశారు. వీరిద్దరికీ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్‌పై మాత్రం విచారణ కొనసాగుతోంది. తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై వాదోపవాదాలు జరిగాయి. అనంతరం పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు రెండు వారాల గడువును సుప్రీంకోర్టు విధించింది. ఈ రోజు చివరి రోజు కావడంతో.. మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. అనంతరం వారికి కోర్టు రిమాండ్ విధించడంతో.. నెల్లూరు సెంట్రల్ జైలుకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాన్ బెయిలబుల్ వారెంట్‌పై కొండా సురేఖ రియాక్షన్
టీటీడీ ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ
Read Latest AP News and National News