Pawan Ippatam Visit: అండగా ఉంటా.. వృద్ధురాలు నాగేశ్వరమ్మకు పవన్ హామీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:42 AM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఓ వృద్ధురాలి కోరిక మేరకు ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్.. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందజేశారు.
గుంటూరు, డిసెంబర్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఈరోజు (బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు రూ.50 వేల నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి లక్ష రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.5 వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు.
అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్‌ను అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్‌కు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది.
కాగా.. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అప్పట్లో గ్రామంలో పర్యటించిన పవన్.. బాధితులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా పవన్‌ను కలిశారు. ఎన్నికల్లో గెలిచాక తమ గ్రామానికి రావాలని పవన్‌ను వృద్ధురాలు కోరారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించి వృద్ధురాలిని పరామర్శించడంతో పాటు ఆమెకు ఆర్థిక సాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇవి కూడా చదవండి...
LVM-3 M-6 రాకెట్ ప్రయోగం విజయవంతం..
సుపరిపాలన యాత్రకు విశేష స్పందన: పీవీఎన్ మాధవ్
Read Latest AP News And Telugu News