Dy CM Pawan Kalyan: పార్టీ ఎంపీలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:43 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఎంపీలతో శుక్రవారం సమావేశమయ్యారు.
అమరావతి, నవంబర్ 28: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు చేశారు.
జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనాలని.. అందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై.. వివరాలు అందించాలని కోరారు. రాష్ట్ర జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందన్నారు.
రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్ధిక సంవత్సరానికి రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారన్నారు. వాటిని పరిశీలించి.. కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళాలని ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం
కాంగ్రెస్‌కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీలు: ఎంపీ ఈటల
For More AP News And Telugu News