Minister Atchannaidu Advice To Fishermen: మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచన
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:14 PM
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వారు విడుదలై స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 30: చేపల వేట సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్య శాఖాల మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. శ్రీలంక నావికా దళం విడుదల చేసిన ఏపీకి చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు కలిశారు. తమ విడుదల కోసం ప్రభుత్వం చేసిన కృషి చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. శ్రీలంక నుంచి ఈ మత్స్యకారులు.. కాకినాడ స్వస్థలం చేరుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేసి.. ఆనందం వ్యక్తం చేశారు. తమ విడుదలకు సహాయ సహకారాలు అందించిన మంత్రి అచ్చెన్నాయుడికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు.. ఈ ఏడాది ఆగస్టు మాసం ప్రారంభంలో వ్యాపార నిమిత్తం తమిళనాడులోని నాగపట్టణం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు.. శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వారిని శ్రీలంక నావిక దళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ అంశాన్ని మత్స్యకారుల కుటుంబ సభ్యులు.. రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సానా సతీష్ ద్వారా వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు.
సీఎం చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి.. న్యూఢిల్లీలోని ఏపీ రెసిడెన్స్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూఢిల్లీలోని శ్రీలంక ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించి.. వారిని విడుదల చేసేందుకు మార్గాన్ని సుగమం చేశారు. అనంతరం వారు ఇటీవల న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత వారి స్వస్థలం కాకినాడకు చేరుకున్నారు. వారు ఇంటికి చేరుకోవడంతో.. ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లువిరిసింది. దాంతో తమ విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మత్స్యకారులు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సార్.. రక్షించండంటూ నిజాం వేడుకోలు
For AP News And Telugu News