Pardhasaradhi: హత్యలు చేయడం.. సీబీఐ విచారణ అడగటం అలవాటే
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:34 PM
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని మంత్రి కె. పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. 2023, ఏప్రిల్ 29వ తేదీన సుమారు రూ. 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందన్నారు.
అమరావతి, నవంబర్17: బాబాయి గొడ్డలి పోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పరకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్‌ది హత్య అని ఆయన కుటుంబం అంటుంటే.. వైసీపీ మాత్రం ఆయనది ఆత్మహత్య అని ప్రచారం చేయడం వెనుక ఏం మర్మం దాగి ఉందంటూ సందేహం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ మృతి చెందిన కొన్ని గంటల్లోనే పోలీసుల ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా ఆయనది ఆత్మహత్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటూ ప్రశ్నించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను బాంబులతో చంపుతామంటూ బెదిరించడం ద్వారా.. ఈ విచారణను అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం సతీష్ కుమార్ హత్యపై సీబీఐ విచారణ జరపాలంటూ వైసీపీ నేతల డిమాండ్ చేయడం ఆ పార్టీ నేతల ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. హత్యలు చేయడం.. ఆ తర్వాత సీబీఐ విచారణ కోరడం ఈ వైసీపీకి అలవాటైపోయిందంటూ మంత్రి పార్థసారథి వ్యంగ్యంగా అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దోపిడీలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023, ఏప్రిల్ 29వ తేదీన సుమారు రూ. 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందన్నారు. దీనిపై అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నం. 19/2023 కింద IPC సెక్షన్లు 379, 381 కేసు నమోదైందని గుర్తు చేశారు.
రూ. వందల కోట్ల స్వామివారి సొమ్ము దొంగతనం జరిగితే అప్పటి వైసీపీ నాయకులు కేవలం చిన్న చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేసి ఈ దొంగతనం కేసు దర్యాప్తును నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ దొంగతనం కేసులో కీలక నిందితుడు రవికుమార్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరపకుండా.. రాచమర్యాదలతో 41A CRPC నోటీసు ఇచ్చి, కాఫీ- టిఫిన్ ఇచ్చి సాగనంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదైన నెలలోనే ఎలాంటి దర్యాప్తు లేకుండా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారన్నారు.
2023, జూన్ 1వ తేదీన ఫిర్యాది సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ కలిసి కోర్టులో “రాజీ” అని జాయింట్ మెమో ఇచ్చారు. ఈ కేసు రాజీ పడటానికి ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్‌కు ఏమాత్రం అర్హత లేదని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ పెద్దల సొత్తా లేక కోట్లాది మంది భక్తులు ఆరాధించే స్వామివారి సొత్తా రాజీ చేసుకోవడానికి? అంటూ జగన్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా జైలుకు పోకుండా ముద్దాయి రవికుమార్‌ను సగర్వంగా బయటికి తీసుకొచ్చారంటూ వైసీపీ పెద్దలపై మంత్రి పార్థసారథి నిప్పులు చెరిగారు.
రూ. 100 కోట్ల విదేశీ కరెన్సీ దోపిడీ నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసి, స్వామివారి పేరిట కేవలం రూ.14 కోట్ల ఆస్తులు రాయించుకున్న కుంభకోణం ఇదని ఆయన అభివర్ణించారు. టీటీడీ బోర్డు అజెండాలో “భక్తుడు రవికుమార్ దానం చేశాడు” అని రాసి రికార్డు చేశారని తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి “భక్తుడా”? అంటూ వైసీపీ నేతల వ్యవహార శైలిపై మండిపడ్డారు. టీటీడీ విజిలెన్స్ స్వయంగా తమ రిపోర్టులో “పోలీసు ఒత్తిడి వల్లే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నామని రాసుకున్నారని తెలిాపారు. ఇంతకీ ఒత్తిడి తెచ్చిందెవరు? అంటూ వైసీపీ నేతలను కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ టీటీడీ లేఖలు.. పోలీసులకు మంత్రి పీఏ ఫిర్యాదు
విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన
For More AP News And Telugu News