Share News

AP Politics: జనసైనికులకు అధిష్టానం వార్నింగ్.. అసలు మ్యాటర్ ఏమిటంటే

ABN , Publish Date - Jan 21 , 2025 | 05:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై కూటమి పార్టీ నేతల వ్యాఖ్యలు కొద్దిరోజులుగా దుమారం రేపుతున్నాయి. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన నాయకులు తమ అభిమాన నాయకులను ఉన్నత పదవుల్లో చూడాలని ఆకాంక్షిస్తున్నారు. నాయకుల ఆకాంక్షలను తప్పుగా ప్రచారం చేస్తూ వైసీపీ కూటమిలో చిచ్చురేపాలనే కుట్రలకు పాాల్పడుతుందనే అనుమానంతో డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నాయకులెవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పరిధి దాటితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

AP Politics: జనసైనికులకు అధిష్టానం వార్నింగ్.. అసలు మ్యాటర్ ఏమిటంటే
Janasena

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం కొద్దిరోజులుగా డిప్యూటీ సీఎం, సీఎం పదవుల చుట్టూ తిరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అజెండాగా కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీలో కొంతమంది నాయకుల ఆకాంక్షను బయటపెట్టినప్పటికీ.. వైసీపీ దీనిపై దుష్ప్రచారం మొదలుపెట్టింది.


పవన్‌ కళ్యాణ్‌ను కాదని లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనతో టీడీపీ ఉందనే ఓ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్ ఈ అంశంపై నాయకులేవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. మరొవైపు టీడీపీ నాయకుల ప్రకటనలపై జనసేన నేతలు పెద్దగా స్పందించనప్పటికీ అక్కడక్కడ కొందరు నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నామంటూ మాట్లాడటం ప్రారంభించారు. రెండు పార్టీల నాయకుల వ్యాఖ్యల్లో పెద్దగా తప్పులేనప్పటికీ.. ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని టీడీపీ, జనసేన అధిష్టానం నిర్ణయించింది. దీంతో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం అంశంపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని శ్రేణులకు జనసేన అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


జనసైనికులకు ఆదేశాలు..

లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలనే వ్యాఖ్యలపై కానీ, సీఎం, డిప్యూటీ సీఎం పదవులకు సంబంధించిన అంశాలపై జనసైనికులు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జనసేన అధిష్టానం తమ శ్రేణులకు సూచించింది. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పదవిపై టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ హైకమాండ్ తమ పార్టీ శ్రేణులకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. తాజాగా జనసేన హైకమాండ్ సైతం డిప్యూటీ సీఎం అంశంపై బహిరంగంగా చర్చించవద్దని, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. పార్టీ లైన్ కు విరుద్దంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని జనసేన అధిష్టానం స్పష్టంచేసింది.


కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర..!

కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని, దీనిలో భాగంగా టీడీపీ, జనసేన నాయకులను రెచ్చగొట్టి, వారి మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అంతర్గత విషయాలపై వైసీపీ నేతలు స్పందించడం, కూటమిలో విబేధాలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. టీడీీపీ, జనసేన అధిష్టానం తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 21 , 2025 | 05:29 PM