Satya Kumar: కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:01 PM
ఉద్దానం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మూలాలపై పరిశోధన చేసేందుకు ఐసీఎంఆర్ ముందుకు వచ్చింది.
అమరావతి, నవంబర్ 19: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన జరిపేందుకు ఇండియన్ కౌన్సెల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. బుధవారం అమరావతిలో మంత్రి సత్యకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ పరిశోదన పూర్తి చేసేందుకు.. 3 దశల్లో ఐసీఎంఆర్ రూ. 6.2 కోట్లను నిధుల రూపంలో ఇస్తుందని తెలిపారు. శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన జరుగుతుందన్నారు. దీని వల్ల రెండేళ్లలో కిడ్నీ వ్యాధుల బారినపడే వారని గుర్తించడం ద్వారా ముందుగానే వారికి చికిత్స అందించేందుకు వీలుకలుగుతుందన్నారు.
అలాగే కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. దీనిపై అతి త్వరలో పరిశోధన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లార్ డాక్టర్ రవిరాజ్ నేతృత్వంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ప్రసాద్ పంపిన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ పరిగణలోకి తీసుకుని ఈ కిడ్నీ వ్యాధుల మూలలపై పరిశోధనకు ఆమోద ముద్ర వేసిందని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ.. వాయిదా వేసిన కోర్టు
Read Latest AP News And Telugu News