Training For Central Government Jobs: నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:20 AM
గుంటూరులో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. కేంద్ర ఉద్యోగాలు పొందేలా తాము ఇచ్చే శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా హితవు పలికారు.
గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏ.ఎస్. రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి, సిలబస్‌పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్టు ఆయన వివరించారు. మన యువత ప్రధానంగా డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల మీదే దృష్టిపెడుతున్నారని, కానీ కేంద్రంలో డిఫెన్స్, బ్యాంకింగ్, రెవెన్యూ, సాంకేతిక రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.
కేవలం గుంటూరు వాసులకే..
ఈ శిక్షణకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత ఉన్నవారికి వేర్వేరుగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హత పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరిపి, ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నివసించే నిరుద్యోగులకు మాత్రమే ఉంటుందని తెలిపారు.
సద్వినియోగం చేసుకోండి
ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సబ్జెక్టులపై, ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ పేపర్లు, మెంటార్ గైడెన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని హితవు పలికారు. అలాగే విజయవాడలో కూడా త్వరలో శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.
Also Read:
ధనవంతులు కావాలంటే..ఈ 3 అలవాట్లను వదులుకోండి.!
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
For More Latest News