Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:25 PM
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా? అంటూ ప్రశ్నించారు.

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai Reddy)ని మంగళగిరి సీఐడీ పోలీసులు (Mangalagiri CID police) విచారించారు. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ (Kakinada Port Private Limited) అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా?, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతనే విషయాలను సాయిరెడ్డి నుంచి సీఐడీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు సాయిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కేవీ రావు ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ సోమవారం నాడు ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాజీ ఎంపీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. "కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మెుదటగా కేవీ రావు మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ముఖ పరిచయం, అలాగే ఏదైనా సోషల్ ఫంక్షన్లలో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడం తప్ప.. అతనికి, నాకూ ఏ విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు లేవని చెప్పా. అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకు దాదాపు రూ.500 కోట్లు బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు. ఆ విషయం నాకు సంబంధం లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తెలియదని వివరించా. అరబిందో వ్యాపార విషయాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశా. నా కుమార్తెను వారికివ్వడం తప్ప, అరబిందో సంస్థతో నాకు ఆర్థిక సంబంధాలు లేవు.
విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పా. రూ.500 కోట్ల లావాదేవీలకు సంబంధించి విక్రాంత్ రెడ్డే చేశారని, చాలా మంది సాక్షులు చెప్పినట్లు సీఐడీ అధికారులు అడిగారు. జగన్ మోహన్ రెడ్డి కాపాడేందుకే మీరు, విక్రాంత్ రెడ్డి కలిసే నగదు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. ఈ డీల్ విషయం జగన్‍కు తెలియదని చెప్పా. అలాగే నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు మరోసారి స్పష్టం చేశా. నన్ను ఉద్దేశపూర్వకంగానే ఒక అధికారికి ఈ కేసులో ఇరికించారు. గతంలో ఏ-2గా ఉన్నా కాబట్టి ఈ కేసులోనూ ఏ-2గా చేర్చారు. కేవీ రావు ఆప్త మిత్రులతో మాట్లాడితే నా పేరు ఇరికించినట్లు చెప్పారు. రాజకీయ బ్రోకర్ కేవీ రావు. అతనంటే నాకు అసహ్యం. జగన్ మోహన్ రెడ్డికి నాకూ మధ్య ద్వితీయశ్రేణి నాయకులు గ్యాప్ తెచ్చారు. దీంతో నా మనసు విరిగిపోయింది. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా. విరిగిన మనసు అతకదు. అందుకే వైసీపీ నుంచి వెళ్లిపోయా. ఘర్ వాపసీ నా మనసులో లేదు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని" చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్