CM Chandrababu Agriculture Review: ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్యం.. రైతులకు వివరించండి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:04 PM
ఏపీ సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, ఉత్పాదకత పెంపు, సేంద్రీయ సాగు ప్రోత్సాహం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
రైతు సేవా కేంద్రాలను (RSKs) మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలు రైతులకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు, సాంకేతిక సహాయం అందించే కేంద్రాలుగా మారాలని ఆయన సూచించారు. రీ-ఓరియంటేషన్ ప్రక్రియ ద్వారా ఆ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించి, రైతులకు మరింత సులభతరం చేయాలని తెలిపారు.
భూసారం పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచి పోషక విలువలతో పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలని ఆయన అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు రైతులకు వివరించాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో మార్పులు సమర్థవంతంగా అమలు కావాలంటే అక్కడి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూసారం పెంపు కోసం ఉపయోగించే పోషకాలలో ఉన్న లోపాలను సవరించి, తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read:
సీఎం చంద్రబాబు, బాలకృష్ణ టార్గెట్‌గా అసభ్యకరమైన పోస్టులు.. చివరికి
ఈ వ్యాధులు చాలా డేంజర్.. లక్షణాలు లేకుండా ప్రాణాలు తీస్తాయి.!
For More Latest News