Share News

CCI Centers Illegal Charges: సీసీఐ కేంద్రాల్లో నిలువు దోపిడీ..

ABN , Publish Date - Dec 05 , 2025 | 09:45 AM

సాధారణంగా పరీక్షల్లో వందకు 35 మార్కులు వస్తే పిల్లలను టీచర్లు పాస్ చేస్తారు. అలానే రైతులు తీసుకొచ్చిన పత్తి బండి సీసీఐ కొనుగోలు కేంద్రంలోనికి వెళ్లాలంటే.. క్వింటాల్ కు రూ.20లు చెల్లిస్తేనే పాస్ చేస్తున్నారు. లేదంటే లోనికి పంపేది లేదని మంకుపట్టు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

CCI Centers Illegal Charges:  సీసీఐ కేంద్రాల్లో నిలువు దోపిడీ..
CCI Centers Illegal Charges

(గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి): సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతు జేబుకు చిల్లు పడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వాళ్లే అన్నదాతలతో ఆడుకుంటున్నారు. సాధారణంగా పరీక్షల్లో వందకు 35 మార్కులు వస్తే పిల్లలను టీచర్లు పాస్ చేస్తారు. అలానే రైతులు తీసుకొచ్చిన పత్తి బండి సీసీఐ కొనుగోలు కేంద్రంలోనికి వెళ్లాలంటే.. క్వింటాల్ కు రూ.20లు చెల్లిస్తేనే పాస్ చేస్తున్నారు. లేదంటే లోనికి పంపేది లేదని మంకుపట్టు పడుతున్నారు. ఇది అప్పటికి చిన్న దోపిడీలా కనిపించినా.. కొనుగోళ్లు పూర్తయ్యే సరికి రూ.కోట్లకు చేరుకుంటోంది.

సాధారణంగా రైతులు తీసుకొచ్చిన పత్తి నిల్వలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం నిర్ధారించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖది. ఈ పని చేసేందుకు ప్రతి సీసీఐ కేంద్రంలో మార్కెటింగ్ శాఖ సూపర్ వైజర్ ను నియమించింది. ఆయా మండలాల నుంచి వచ్చిన రైతుల వివరాలు సీఎం యాప్, కిసాన్ యాప్ లో సక్రమంగా ఉన్నాయా లేదా అన్న విషయం సదరు సిబ్బంది పరిశీలిస్తారు. వారు పరిశీలించిన తర్వాతే మిగిలిన కొనుగోలు ప్రక్రియ ఆరంభం అవుతుంది.


అదే అదునుగా...

ఒకవేళ మార్కెటింగ్ శాఖ సిబ్బంది వివరాలు నిర్ధారించకపోతే సీసీఐ కేంద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. రైతుల ఇటువంటి అవసరాన్ని ఆధారం చేసుకొని క్వింటాల్ కు రూ.20 ఇస్తే కానీ, పత్తి లోడ్ ను పాస్ చెయ్యమని సిబ్బంది తెగేసి చెబుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వే బ్రిడ్జి బరువు ఆధారంగా నగదు ముందే వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి రైతు కనీసం రూ.200 నుంచి రూ.400 వరకు చెల్లించి లోపలికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. గతంలోనూ ఇదే వ్యవహారంపై దుమారం రేగింది. మార్కెటింగ్ సిబ్బంది చేస్తున్న వసూళ్ల దందాపై ఒక వ్యక్తి రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.


రూ.20 అంటే సామాన్యం కాదు

సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి క్వింటాల్ పత్తికి రూ.20 వసూలు చేస్తున్నారన్నది చిన్న విషయంగా తోచినా.. సీజన్ మొత్తంలో అది పెద్ద మొత్తంగానే కనిపిస్తుంది. ఉదాహరణకు గతేడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 9.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అప్పుడు కూడా క్వింటాల్ కు రూ.20 వసూలు చేసినట్లు పలువురు మార్కెటింగ్ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ లెక్కన గతేడాది సుమారుగా రూ.1.90 కోట్లు వసూలు చేసినట్లు స్పష్టం అవుతుంది. ఇలా వసూలు చేసే సొమ్ము ఆ శాఖలోని కీలకమైన వారి వద్దకు చేరుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అవి బుట్టదాఖలు అన్నట్లుగానే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


దిగుమతి కూలీ రెట్టింపు

ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో దింపుడు కూలీ ధరలు ఆసాంతం పెంచేశారు. గతంలో ఉన్న ధర కంటే రెట్టింపు కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు చక్రాల ఆటోలో పత్తి తీసుకువస్తే దిగుమతి కూలీ రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు, అదే ట్రాక్టర్ లో తీసుకువస్తే రూ.1500 కు తగ్గకుండా తీసుకుంటున్నారు. లారీలో అయితే ఒక్కో చోట ఒక్కో ధర వసూలు చేస్తున్నారు. దిగుమతి కూలీ వ్యవహారంలో ఒకే విధానం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

Jaggayyapeta murder: జగ్గయ్యపేటలో సస్పెక్ట్ షీటర్ దారుణ హత్య

Updated Date - Dec 05 , 2025 | 10:54 AM