CRDA: సీఆర్డీఏకు షాక్ ఇచ్చిన రైతులు.. రంగంలోకి మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 05 , 2025 | 10:21 PM
సీఆర్డీఏలో రెవెన్యూ ఉద్యోగులు అవినీతిపై మంత్రి నారాయణకు రాజధాని అమరావతి రైతులు ఫిర్యాదు చేశారు. కొందరు ఉద్యోగులు లంచం కింద ఫ్లాట్లు ఇవ్వాలని అడుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ, ఆగస్ట్ 04: రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి తమ సహాకారం ఎప్పుడూ ఉంటుందని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణతో రాజధాని అమరావతి ప్రాంత రైతు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చూపించాలని కోరామన్నారు. రైతుల అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న పలు కేసులపై కూలంకుషంగా చర్చించామని చెప్పారు.
అలాగే రైతులకు కౌలు ఇచ్చే అంశంపై సైతం చర్చించామన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రహదారులు, మంచినీరు, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 900 కోట్లు కేటాయించాలని మంత్రి నారాయణను కోరినట్లు వారు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలోని కాలుష్య నివారణ, భారీ వాహనాలపై నిఘా పెట్టాలని కోరామన్నారు. గ్రామ కంఠాల సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశామన్నారు. హై టెన్షన్ వైర్లను తొలగించాలని కోరామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు టిడ్కో ఇల్లు కేటాయించాలని అడిగామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో రైతుల ఫ్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రికి వివరించామని చెప్పారు.
అయితే 29 గ్రామాలు అమరావతి నగరంలో వార్డులుగా రూపాంతరం చెందుతాయన్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు స్పష్టం చేశారు. అక్కడ రైతులు భూములు ఇవ్వాలా? వద్దా? అన్నది వారి ఇష్టమని చెప్పారు. సీఆర్డీఏలో రెవెన్యూ ఉద్యోగులు అవినీతిపై సైతం మంత్రికి ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. కొందరు ఉద్యోగులు లంచం కింద ఫ్లాట్లు ఇవ్వాలని తమకు అడుగుతున్నారని రాజధాని ప్రాంత రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: కేటీఆర్
మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం
For More AP News and Telugu News