Elections in Ballot Paper: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: కేటీఆర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:36 PM
ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలున్నాయని ఈసీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అనేక దేశాలు నేటికి బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 05: ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
వచ్చే సాధారణ ఎన్నికల కల్లా దేశవ్యాప్తంగా బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. అయితే ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అదీకాక.. అనేక దేశాలు నేటికి బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బాండ్ పేపర్లతో ప్రజలను వంచించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ఎన్నికైన ప్రజా ప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై కూడా ఈ సందర్భంగా చర్చించామన్నారు. ఓటర్లను ఉద్దేశ పూర్వకంగా తీసేయలేదని ఎన్నికల సంఘం తమకు స్పష్టం చేసిందని వివరించారు.
ఓటరు జాబితా సవరణ మంచిదే కానీ.. అందర్నీ విశ్వాసంలోకి తీసుకొని చేయాల్సి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ చేయాలన్నారు. బూత్ లెవల్ కమిటీలతో అఖిల పక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్లను ఎందుకు తీసేస్తున్నారానే కారణాలపై ఎన్నికల సంఘం జాబితా పెట్టాలన్నారు. దొంగ హామీలు, వాగ్దానాలతోపాటు అమలు చేయని హామీలపై సైతం ఈ సందర్భంగా ఈసీతో చర్చించామన్నారు. కారు గుర్తుని పోలిన సింబల్స్ ఉంచకూడదని ఎన్నికల సంఘాన్ని తాము కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం
సెకన్లలో పెను విధ్వంసం.. సంచలన విజువల్స్..
For More Telangana News and Telugu news