Share News

AP Liquor Scam: మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:18 PM

లిక్కర్ స్కామ్‌లో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అతడి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

AP Liquor Scam: మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం

విజయవాడ, ఆగస్టు 05: లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 12వ తేదీ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ4గా మిథున్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన ఆయన.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


ఈ రోజు ఏసీబీ కోర్టులో ఏం జరిగిందంటే..

ఈ మద్యం స్కామ్‌కు సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఎక్కడా మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి ఇప్పటి వరకు కోరలేదని వారు తెలిపారు. లిక్కర్ స్కామ్ జరగలేదని.. ఈ కేసులో అసలు మిథున్ రెడ్డి పాత్ర లేదని ఏసీబీ కోర్టుకు వారు స్పష్టం చేశారు. దాంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.


ఇక సెట్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. డి కార్ట్ లాజిస్టిక్స్, స్పై ఆగ్రోస్ నుంచి నగదు మిథున్ రెడ్డి కంపెనీల్లో బదిలీ జరిగింది ఏసీబీ కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా తెలియజేశారు. పీఎల్ఆర్ కంపెనీ లావాదేవీల్లో లిక్కర్ నగదు బదిలి అయినట్లు సిట్ ఇప్పటికే గుర్తించిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కోర్టును అభ్యర్థించారు. మంగళవారం ఈ వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


జగన్ హయాంలో జరిగిన మద్యం విక్రయాలపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఈ మద్యం స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఇప్పటికే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అందులోభాగంగా వారిని విచారించింది. దాదాపు రూ. 3500 కోట్ల మద్యం స్కామ్ జరిగినట్లు గుర్తించింది. అదీకాక ఈ మద్యం కుంభకోణం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియల రాజ్ కసిరెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు.


ఈ నేపథ్యంలో అతడిని సిట్ అరెస్ట్ చేసి వివరాలు రాబట్టింది. అలాగే వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే మిథున్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. ఇక ఈ విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో దాదపు 11 కోట్ల నగదును సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును కోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తరలించారు.

Updated Date - Aug 05 , 2025 | 06:18 PM