Capital Amaravati: రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ఆదేశాలు జారీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:20 PM
రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.
అమరావతి, డిసెంబర్ 02: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు. ఏడు గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగిస్తున్నట్లు ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో.. వైకుంఠపురంలో 1,965 ఎకరాలు,పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా, యండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమితోపాటు కర్లపూడి, లేమల్లే 2,603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించనుంది.
ఇక గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో.. వడ్డమానులో 1,763.29 ఎకరాల పట్టా, 4.72 అసైన్డ్ భూమి.. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ భూమి.. పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేపట్టాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. 7 గ్రామాల్లో కలిపి 16,562.52 ఎకరాల పట్టా భూములు, 104.01 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించాలని సీఆర్ డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ భూ సమీకరణలో 3828.30 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు
For More AP News And Telugu News