AP News: మహనీయుల త్యాగాలు మరువకూడదు..
ABN , Publish Date - Aug 15 , 2025 | 07:49 AM
ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల త్యాగాలు మరిచిపోకూడదని, ఈ నాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమే అని స్వాతంత్య్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక స్వాంత్య్ర సమర యోధుడు ఈయనే.
- స్వాతంత్య్ర ఫలాలు అందరివీ
- దేశాభివృద్ధిలో యువతే కీలకం
- నైతిక విలువలు కోల్పోతే సమాజమే సమాధి
- స్వాతంత్య్ర సమరయోధులు పెడబల్లె బాలయల్లారెడ్డి
చెన్నూరు(కడప): ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల త్యాగాలు మరిచిపోకూడదని, ఈ నాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమే అని స్వాతంత్య్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక స్వాంత్య్ర సమర యోధుడు ఈయనే. 105ఏళ్ల వయసులో కూడా స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే ఆయనలో ఎక్కడ లేని ఆనందం, భావోద్వేగం కనిపిస్తాయి. ఆంధ్రజ్యోతి ఆయనను పలకరించగా.. నాటి స్మృతులు, పడ్డ కష్టాలు, యువకునిగా అప్పట్లో తాను బ్రిటీషు వారి ఆగడాలను ఎదుర్కోవడానికి తనతోటి స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి చేసిన పనులు చెప్పుకొచ్చారు. నాటి అనుభవాలు, నేటి దేశ పరిస్థితి గురించి ఆయన మాటల్లోనే..
కాజ్‌వే పగలకొట్టాం
బ్రిటీషు వారితో పెద్ద పోరాటాలు చేయకపోయినా మావంతుగా దేశం కోసం తెల్ల దొరలను కొంతమేర ఎదిరించి వారి పనులకు అడ్డుకట్ట వేయించాము. మండలంలో మొత్తం 18 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉండేవారు. 1943-44 ప్రాంతంలో చెన్నూరులో ఉన్న పెన్నా లోలెవల్ కాజ్‌వే మీదుగా బ్రిటీషు వారు రాకపోకలు సాగించకుండా రెండు చోట్ల కాజ్‌వేను పగలగొట్టాం. అప్పట్లో పెన్నాపై హైలెవెల్ వంతెన ఉండేది కాదు. కడప నుంచినంద్యాల, కర్నూలు, హైదరాబాదు వెళ్లాలంటే ఈ చెన్నూరు వద్ద గల లోలెవల్ కాజ్‌వే దాటి వెళ్లాలి. అందుకే వారిని కడప వైపు రానివ్వకుండా కాజ్‌వేపైన రెండు చోట్ల పగలకొట్టి పెద్ద పెద్ద రాళ్లు తొలగించాం. దీంతో బ్రిటీషువారు కోపంతో మమ్మల్ని పట్టుకోవాలని జైల్లో పెట్టాలని ప్రయత్నించగా ఇతర సమరయోధులు, యువత కలిసి వారిని అడ్డుకున్నారు. అలా దేశం కోసం నావంతుగా చిన్నపాటి సాయమందించా.
దేశభక్తి నూరిపోసేవారు
దేశాభివృద్ధిలో నాటి నుంచి నేటి వరకు యువతే కీలకం. నాడు పెద్దలు దేశభక్తి గీతాలు, చరిత్రలు, గొప్పగొప్ప వారి కథలు చెబుతుంటే విని యువ రక్తం పొంగి బ్రిటీషు వారిపై తిరగబడ్డారు. యువతలో ప్రేరణ కలిగించేందకు ఎందరో గొప్ప గొప్ప వారి చరిత్రలు ఊరు వాడ వినిపించేవారు. పైగా మదనపల్లెలాంటి ప్రాంతాల నుంచి గొప్ప వ్యక్తులు వచ్చేవారు. దూర ప్రాంతాల నుంచి కూడా చెన్నూరుకు వచ్చి రాత్రివేళ దేశభక్తి గురించి యువతలో నూరి పోసేవారు. అందుకే యువత ఉత్తేజితమై బ్రిటీషు వారిని ఎదుర్కోగలిగాం.
స్వాతంత్య్ర ఫలాలు అందరివీ
స్వాతంత్య్రం కోసం కులమత జాతి భేదం లేకుండా పోరాడాం. ఈ పోరాటంలో ఎందరో పాల్గొన్నారు. వారి పోరాట ఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలి. అందుకే అవి కొందరివి కాదు అందరివీ. అందరికీ సమానంగా అందాలి. అయితే నేడు కులం, జాతిలాంటివే సమాజాన్ని నడిపించే పరిస్థితి రావడం బాధ కలిగిస్తుంది. ఇది మంచి పద్ధతికాదు, దేశాభివృద్ధికి అడ్డంకి.
దండలు - దండాలతోనే సరి
జిల్లాలో జీవించి ఉన్న సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి ఒక్కరే. ఆగస్టు 15 వచ్చినప్పుడల్లా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రావడం శాలువాలు కప్పడం, మెడలో పూలదండలు వేయడం, నమస్కారాలతో సరిపెడుతున్నారు. ఒక్కగానొక్క సమరయోధుడు జీవించి ఉన్నాడు. ఆయన కుటుంబానికి కాస్తంత ఆసరా కల్పిస్తాం అన్న ఆలోచన మాత్రం నేటికీ ఎవరికీ లేదు. ఇంటిస్థలం ఇవ్వాలంటూ ఎన్నోమార్లు ఆయన విన్నవించగా 6 సెంట్ల స్థలం.. అదీ చలమారెడ్డిపల్లె గుట్టమీద ఇచ్చారు. 100 సంవత్సరాలు దాటిన వ్యక్తికి గుట్టమీద స్థలం ఇస్తే ఎలా..? గుట్టమీద కాకుండా ఊర్లో లేదా ఊరికి సమీపంలో స్థలం ఇవ్వాలని స్వాతంత్య్ర సమరయోధుడు కోరుతున్నారు.
నైతిక విలువలు కోల్పోతే సమాధే
ప్రజలు నైతిక విలువలు కోల్పోతే సమాజమే సమాధి అవుతుంది. ఎవరిలో అయితే, ఎక్కడైతే నైతిక విలువలు ఏమాత్రం దిగజారకుండా ఉంటాయో అక్కడ అబివృద్ధి ఉంటుంది. నీతి నిజాయితీ నిండి ఉంటాయి. నేడు టీవీల్లో నేతల ప్రసంగాలు, అప్పుడప్పుడూ ప్రచారాలు చూస్తున్నా.. ఏమిటివి? దేశానికి ఉపయోగపడేవేనా అన్న విధంగా మనసుకు అనిపిస్తుంటుంది. వాస్తవ పరిస్థితుల్లో సమాజం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. నాయకుల మాటలతో మభ్య పెట్టకుండా చేతలతో అభివృద్ధిని చూపిస్తూ దేశం కోసం పాటుపడాలి. అంతర్గత శత్రువులు నాటి నుంచి నేటి వరకు ఉంటున్నారు. వారిని నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలి. అటువంటి వారు ఎవరైనా సరే ఉపేక్షించరాదు. యువత అన్నివిధాలుగా చైతన్యవంతులు కావాలి. దేశ సమగ్రతకు బాటలు వేయాలి. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News