Share News

Water Projects : జలవనరుల శాఖలో ప్రాజెక్టు టూరిజం!

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:00 AM

టెంపుల్‌ టూరిజం తరహాలో ప్రాజెక్టు టూరిజాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.

Water Projects : జలవనరుల శాఖలో ప్రాజెక్టు టూరిజం!

  • పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకూ ఆహ్వానం

  • సోలార్‌ ప్యానళ్లతో విద్యుదుత్పత్తి

  • ఫ్లోటింగ్‌ సోలర్‌ ప్యానళ్లూ ఏర్పాటు

  • ఆదాయార్జనకు ప్రణాళికలు

(అమరావతి-ఆంద్రజ్యోతి)

జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఆదాయార్జనపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. టెంపుల్‌ టూరిజం తరహాలో ప్రాజెక్టు టూరిజాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇం దుకోసం పర్యాటక శాఖ భాగస్వామ్యంతో పా టు ప్రైవేటు సంస్థలనూ ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతం, కాలువ గట్ల వద్ద సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయ డం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్యానళ్లను నదీ జలాలు, ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయడం ద్వారా సోలార్‌ విద్యుదుత్పత్తిని చేయవచ్చని యోచిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం ఈ తరహా విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తోందని చెబుతున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలోని సాగునీటి యాజమాన్య సంఘాల ద్వారా నీటి తీరువాను సక్రమంగా వసూలు చేయడం ద్వారా పూర్తిస్థాయిలో ఆదాయాన్ని పొందే వీలుంటుందని భావిస్తున్నారు. అలాగే పారిశ్రామిక సంస్థల నుంచి సెస్‌ను గరిష్ఠ స్థాయిలో వసూలు చేయడంపై దృష్టి సారించాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జల వనరుల శాఖ సిబ్బంది కోసం నిర్మించే కాలనీలను అభివృద్ధి చేయడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకురావాలన్న యోచనలో జల వనరుల శాఖ ఉంది.


ల్యాండ్‌ బ్యాంక్‌గా మిగులు భూమి

రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో జల వనరుల శాఖ ఏటా పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల దాకా బడ్జెట్‌లో కేటాయింపులకు నోచుకోలేకపోతోంది. ఫలితంగా ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణే భారంగా మారుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇతర ఆదాయ మార్గాలతో పాటు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సేకరించిన మిగులు భూమిని ‘ల్యాండ్‌ బ్యాంక్‌’గా మార్చుకోవాలని నిర్ణయించింది. నిరుపయోగంగా వదిలేయడం వల్ల విలువైన ఆస్తి అన్యాక్రాంతమవుతోందని, ఇతర శాఖలు చేజిక్కించుకుంటున్నాయని చెబుతోంది. విజయవాడ, విశాఖపట్నం సహా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో జల వనరుల శాఖకు చెందిన విలువైన భూములు, భవనాలను ఇతర శాఖలు సొంతం చేసుకున్నాయి.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:00 AM