Share News

Justice Sathyanarayana : ఆధారాలుంటే అందజేయండి

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:07 AM

టికెట్ల కోసం తొక్కిసలాట జరిగిన ఘటనపై న్యాయవిచారణ తొలిదశ ముగిసింది. ప్రభుత్వం నియమించిన కమిషన్‌ మూడవ రోజైన సోమవారం జిల్లాలోని...

 Justice Sathyanarayana : ఆధారాలుంటే అందజేయండి
Tirumala Stampede

  • తిరుపతి తొక్కిసలాటపై ప్రజలకు విచారణ కమిషన్‌ పిలుపు

  • కలెక్టర్‌, సీవీఎస్వో, డీఆర్వోలను ప్రశ్నించిన కమిషన్‌ చైర్మన్‌

  • ముగిసిన తొలి దశ విచారణ.

  • రెండోదశ విచారణకు 52 మంది బాధితులు?

  • సస్పెండ్‌, బదిలీ అయిన అధికారుల విచారణ మూడో దశలో..

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట జరిగిన ఘటనపై న్యాయవిచారణ తొలిదశ ముగిసింది. ప్రభుత్వం నియమించిన కమిషన్‌ మూడవ రోజైన సోమవారం జిల్లాలోని కీలక అధికారులను విచారించింది. జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, టీటీడీ ఇన్‌చార్జి చీఫ్‌ విజిలెన్స్‌-సెక్యూరిటీ అధికారి(సీవీఎస్వో) మణికంఠ చందోలు(చిత్తూరు ఎస్పీ), డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులను కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి వేర్వేరుగా విచారించారు. ఘటన జరిగిన తీరుతోపాటు, టీటీడీ యంత్రాంగం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారా? అని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను గంటపాటు ప్రశ్నించినట్టు తెలిసింది. కలెక్టర్‌ రాతపూర్వకంగా పూర్తిస్థాయి నివేదికను అందజేశారు. టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్వో మణికంఠ చందోలు రికార్డు సమర్పణకు కొంత గడువు కోరినట్లు తెలిసింది. ఆయనతో పాటు తిరుపతి వీజీవో సదాలక్ష్మి కూడా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. పోలీసు, టీటీడీ విజిలెన్సు విభాగం రికార్డుల సమర్పణకు గడువు కోరాయి. దీంతో తొలి దశ విచారణ ముగించుకుని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణ విజయవాడకు బయలుదేరి వెళ్లారు. రెండో దశ విచారణకు ఈ నెల 20వ తేదీ తరువాత తిరిగి తిరుపతికి రానున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన 46 మంది, మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు సంబంధించిన వారిని రెండోదశలో కమిషన్‌ విచారించనుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని వారందరికీ నోటీసులు పంపారు.

Untitled-3 copy.jpg


తొక్కిసలాట నేపథ్యంలో సస్పెండ్‌, బదిలీ అయిన అధికారులు, ఇతర సిబ్బందిని మూడవ దశలో కమిషన్‌ విచారించనున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏమైనా సమాచారం, ఆధారాలు ఉంటే తమకు ఆ సమాచారంతోపాటు అవసరమైన పత్రాలను అందజేయాలని ప్రజలకు న్యాయవిచారణ కమిషన్‌ పిలుపునిచ్చింది. 20రోజుల్లోపు వాంగ్మూలాన్ని ప్రమాణబద్ధమైన అఫిడవిట్‌తో కలిపి సమర్పించాలని పేర్కొంది. ఆ తరువాత ఎటువంటి పత్రాలు, సాక్ష్యాలు స్వీకరించబోమని తెలిపింది. వీటిని ఈ నెల 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ బీ-బ్లాక్‌లోని న్యాయవిచారణ కమిషన్‌ చాంబర్‌-413లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు సమర్పించవచ్చని పేర్కొంది.

Updated Date - Feb 04 , 2025 | 08:15 AM