AP News: ఫసల్ బీమాతో... రైతులకు ధీమా
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:28 AM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీ ఎంఎఫ్‌బీవై) రైతు నష్ట నివారణకు దోహదపడుతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి అందేవరకు అన్నదాతలకు ఆందోళన తప్పట్లేదు.
- రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38వేలు బీమా
- ఈ నెల 15 వరకు గడువు
అమలాపురం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీ ఎంఎఫ్‌బీవై) రైతు నష్ట నివారణకు దోహదపడుతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి అందేవరకు అన్నదాతలకు ఆందోళన తప్పట్లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంటకు నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్టు వ్యవసాయ శాఖ అమలాపురం డివిజన్ సహాయ సంచాలకుడు కెనడీ, మండల వ్యవసాయాధికారి కె.ప్రవీణ్ తెలిపారు. వరి పంటకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రూ.76 ప్రీమియం చెల్లిస్తే చాలు..
- ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద రూ.76 ప్రీమియంగా చెల్లిస్తే రూ.38వేలు బీమా వర్తిస్తుంది.
- పంట ముంపు బారిన, చీడపీడల బారిన పడ్డా, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినా ఫసల్ బీమా వర్తిస్తుంది.
- పంటకోసి పనలపై ఉన్నప్పుడు అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు కారణంగా పంట దెబ్బతిన్నా బీమా వర్తింపజేస్తారు.
- పంట ముంపు బారిన పడితే 48 గంటల్లోగా సంబంధిత బ్యాంకులతో పాటు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి.

- గ్రామం యూనిట్‌గా నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లిస్తారు.
- బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నరైతులకు బ్యాంకులే ప్రీమియం చెల్లించి బీమాను వర్తింపచేస్తాయి.
- రుణం తీసుకోని రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్, పోస్టాఫీసు ద్వారా ప్రీమియం చెల్లించి రసీదు పొందవచ్చు.
- ఇందుకోసం హెల్ప్ లైన్ నెంబరును ప్రకటించారు. టోల్‌ఫ్రీ నెంబరు 1800-209-3536, ఎన్‌సీఐపీ హెల్ప్‌లైన్ నెంబరు 14447కు సమాచారం అందించి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News