Share News

Farmers : అమరావతి రైతు రుణ ఘోష..!

ABN , Publish Date - Feb 09 , 2025 | 06:04 AM

చేతిలో భూమి లేదని బ్యాంకులు అప్పులివ్వడం లేదు. వ్యవసాయ పరపతి సంఘాలూ రుణాలివ్వడం లేదు.

Farmers : అమరావతి రైతు రుణ ఘోష..!

  • ఎక్కడా రూపాయి అప్పు పుట్టని పరిస్థితి

  • గత ప్రభుత్వ వైఖరితో అప్పుల ఊబిలోకి

  • ప్రభుత్వం మారినా దక్కని రుణ పరపతి

  • ససేమిరా అంటున్న బ్యాంకులు, సొసైటీలు

  • ప్రైవేటు ఫైనాన్షియర్ల చేతికి చిక్కి విలవిల

  • సేల్‌డీడ్ల రూపంలో ప్లాట్లు కోల్పోతున్న దైన్యం

రాయపూడికి చెందిన ఓ రైతు రాజధానికి 60 సెంట్ల పొలం ఇచ్చాడు. ఆయనకు ప్రభుత్వం నుంచి రిటర్నబుల్‌ ప్లాటు వచ్చింది. వైసీపీ హయాంలో కౌలు రాకపోవడంతో అప్పు చేయాల్సి వచ్చింది. బ్యాంకులు ప్లాటుపై లోను ఇవ్వకపోడంతో ప్రైవేటుగా అధిక వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఫైనాన్సర్‌ తనఖాకు ఒప్పుకోకపోవడంతో సేల్‌ డీడ్‌ రూపంలో రిజిస్టర్‌ చేశాడు. ఆ అప్పు తీర్చలేక ప్లాటు పోగొట్టుకున్నాడు.

వెలగపూడికి చెందిన ఒక రైతు గత ఐదేళ్లు కౌలు అందక అప్పులపాలయ్యాడు. పొలాలు రాజధానికి ఇవ్వడంతో వ్యవసాయ రుణాలు రాలేదు. రిటర్నబుల్‌ ప్లాట్లపై బ్యాంకులు అప్పులు ఇవ్వడంలేదు. దీంతో ఆయన కుమార్తె వివాహానికి ప్లాట్లు తనఖా పెట్టి భారీ వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నాడు. వడ్డీల భారం తడిసి మోపెడవడంతో తన ప్లాట్లు అమ్మేసుకుని అప్పు తీర్చాల్సి వచ్చింది.

(గుంటూరు, తుళ్లూరు - ఆంధ్రజ్యోతి)

రాజధానికి భూములివ్వడంతో రైతు తన పరపతిని కోల్పోయాడు. ఎక్కడా అప్పు పుట్టడం లేదు. చేతిలో భూమి లేదని బ్యాంకులు అప్పులివ్వడం లేదు. వ్యవసాయ పరపతి సంఘాలూ రుణాలివ్వడం లేదు. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది...! రాజధాని కోసం భూములిచ్చే సమయంలో రైతు ఊహకు కూడా రాని ఈ పరపతి అంశం ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. రుణ పరపతి కోల్పోవడం ఒక ఎత్తయితే.. ప్రైవేటు ఫైనాన్సర్ల చేతిలో పడి సర్వస్వం కోల్పోవడం మరొక ఎత్తు. రైతుల్లో అనేక మంది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కూడా కోల్పోయి నిరాశ్రయులుగా మారుతుండడం విషాదకరం.


వైసీపీ ప్రభుత్వ వైఖరితోనే చిక్కులు

గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాజధాని నిర్మాణాన్ని ఆపేసింది. రైతులకు కౌలు ఇవ్వకుండా ఆడుకుంది. చేతిలో పనిలేక, కౌలు అందక రాజధాని రైతులు అప్పులపాలయ్యారు. పిల్లల చదువులు, శుభకార్యాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. గతంలో పొలాలపై వ్యవసాయ రుణాలు వచ్చేవి. లేదంటే పొలాలు బ్యాంకుల్లో తనఖా పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకునేవారు. ఆ అవకాశం లేకపోవడంతో ప్రైవేటు ఫైనాన్సర్లపై ఆధారపడాల్సి వచ్చింది.

సేల్‌ డీడ్లతో బలైన అన్నదాత

ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అనడంతో రైతులు ప్రైవేటు ఫైనాన్సర్లపై ఆధారపడుతున్నారు. అయితే వారు ప్లాట్లను తనఖా పెట్టుకోవడం కాకుండా, రైతులు తమకు ప్లాట్లు అమ్మినట్లు సేల్‌డీడ్లు రాయించుకొని, రిజిస్టర్‌ చేయించుకున్నారు. అధిక వడ్డీలతోపాటు, ఈ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వచ్చింది. వడ్డీలు, చక్రవడ్డీలతో భారంగా మారిన అప్పులు తీర్చలేక అనేక మంది ప్లాట్లు కోల్పోయారు. ఎవరైనా అప్పు తీర్చినా మళ్లీ తనపేర ప్లాటు రిజిస్టర్‌ చేయించుకోవడానికి అయ్యే ఖర్చును ఆ రైతే పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా రెండు సార్ల రిజిస్ట్రేషన్‌ ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. రైతుల అప్పులను ఆసరా చేసుకుని ప్లాట్ల రేట్లను కూడా భారీగా తగ్గించి కొంటున్నారు. ప్రస్తుతం గజం రూ.60, 70 వేలు ఉన్న ప్లాట్ల ధరలను రూ.15 నుంచి 20 వేలు తగ్గిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను రక్షించాల్సిన బాధ్యత సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.


ప్లాట్ల రేట్లు తగ్గించేస్తున్నారు

‘రైతుల నుంచి చౌకగా ప్లాట్లు కాజేస్తున్నారు. అప్పులున్నవాళ్లు అమ్ముకోక తప్పదన్న ఉద్దేశంతో గజానికి రూ.15, 20 వేలు తక్కువకు అడుగుతున్నారు. ప్రభుత్వం రుణ పరపతి కల్పిస్తే, బ్యాంకులు రుణాలిస్తే ఈ బాధ ఉండదు.’

- షేక్‌ సైదులు, తుళ్లూరు

తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వాలి

‘గోల్డ్‌ లోన్‌ ఇచ్చినట్టుగా ప్లాట్లు మీద కూడా రుణం ఇవ్వమని అడిగాం. బ్యాంకులు కుదరదని చెప్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకర్ల నుంచి రుణాలు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.’

- లంకా సుధాకర్‌, జేఏసీ, వెంకటపాలెం

అప్పులపాలై చనిపోతున్నారు

‘వైసీపీ ఐదేళ్ల పాలనలో కౌలు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులపాలై, మనోవ్యధతో అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. చాలా మంది ఉపాధి లేక వలస పోయారు. ప్లాట్లు పెట్టుకుని రుణాలు ఇవ్వమంటే బ్యాంకర్లు కుదరదని చెబుతున్నారు.’

- కాటా అప్పారావు, అమరావతి రైతు జేఏసీ

ఫైనాన్సర్ల చేతిలో రైతు బలి

‘అప్పులు దొరక్క రైతులు ఫైనాన్సర్ల మీద ఆధారపడుతున్నారు. వారి వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకుని, అవి తీర్చలేక ప్లాట్లు కూడా వదిలేసుకుంటున్నారు. అప్పు ఎలాగూ తీర్చలేరన్న ఉద్దేశంతో ఫైనాన్సర్లు ముందుగానే సేల్‌డీడ్‌ రాయించుకుని సులభంగా రైతుల భూములు కాజేస్తున్నారు. ఇది ఆగాలంటే ప్రభుత్వం గతంలోలా సొసైటీల ద్వారా రుణ పరపతి కల్పించి, తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు ఇవ్వాలి.

- ఇడుపులపాటి సీతారామయ్య, వెలగపూడి

అప్పు పుట్టడం లేదు

‘జగన్‌ ప్రభుత్వంలో కౌలు ఆపేయడంతో అప్పులపాలైపోయాం. పిల్లల చదువులకు, శుభకార్యాలకు కూడా రూపాయి లేక నరకం చూస్తున్నాం. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వకపోవడంతో బయట అప్పులు తెచ్చాం. అవి తీర్చలేక ప్లాట్లు కోల్పోయి నిలువ నీడలేని స్థితికి వస్తున్నాం.’

- కే. గోవిందమ్మ, తుళ్లూరు

Updated Date - Feb 09 , 2025 | 06:10 AM