Share News

Kakinada News: నిబంధనలకు 'నీళ్లు'.. నీటి నాణ్యత గాలికి..

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:48 PM

స్వచ్ఛమైన నీటిని తాగాలనే సంకల్పంతో జనాలు మినరల్ వాటర్ ప్లాంట్ల బాట పట్టారు. ఖరీదైనా సరే ఆ నీటినే తాగుతున్నారు. అయితే.. వీటి నిర్వహణలో మాత్రం నాణ్యత కరవైంది. కాకినాడలో ఇటీవల పలు ఆర్వో ప్లాంట్లను తనిఖీ చేసి.. నీటి శాంపిళ్లను పరిశీలనకు పంపగా ప్లాంట్ల నిర్వహణా లోపాలు బయటపడ్డాయి.

Kakinada News: నిబంధనలకు 'నీళ్లు'.. నీటి నాణ్యత గాలికి..
Illegal Mineral Water Plants in Kakinada

కాకినాడ, డిసెంబర్ 05: స్వచ్ఛమైన నీటినే తాగాలి. దీనికి తగినట్టే ప్రస్తుతం జనం మినరల్ బాటపట్టారు. ఎంత ఖరీదైనా సరే.. ఆ నీటినే కొనుక్కుని మరీ తాగుతున్నారు. అయితే.. మనం తీసుకునే ఈ నీరు నాణ్యమైనదేనా? అనే ఆలోచన చాలా మందికి ఉండటం లేదు. ఆర్వో వాటర్ ప్లాంట్ అని కనిపిస్తే చాలు.. అక్కడి నుంచే నీటిని కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. మరోవైపు నీటి వ్యాపారం బాగుండటంతో వీధికొకటి చొప్పున మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి. కాకినాడ జిల్లాలో ఇటీవల కాలంలో తాగు నీటి శుద్ధి ప్లాంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. 20 లీటర్ల బాటిల్ నీటిని పట్టుకోవాలంటే రూ.10 నుంచి మొదలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.


అనుమతలు లేకుండానే..

కాకినాడ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా విస్తరించాయి. వాస్తవానికి మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రామ పంచాయతీ, పురపాలక సంస్థ నుంచి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని విద్యుత్ శాఖ కనెక్షన్ పొందాలి. ట్రేడ్ లైసెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్), ఆహార కల్తీ నిరోధక, భూగర్భజల, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఇవన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. జలనాణ్యతను పరిశీలించే పరికరాలు, రసాయనాలు, మైక్రో బయాలజిస్టు లేదా కెమిస్టులు ప్లాంటులో పనిచేయాలి. స్టీల్ డ్రమ్ములు, అంతర్గత పైప్‌లైన్, ఏసీలు ఉపయోగించాలి. యంత్రాలకు వాడే ఫిల్టర్‌లను నెలకోసారి శుభ్రం చేయాలి. ప్రతి రోజూ టీడీఎస్ పరికరం ద్వారా నీటి సాంద్రతను పరిశీలించి నమోదు చేయాలి. కానీ, ఇవన్నీ ఎక్కడా జరగడం లేదు. అనుమతులూ తీసుకోవడం లేదు.


అన్ని అనుమతులతో ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.50 లక్షలపైనే ఖర్చవుతుందని అంచనా. తూతూ మంత్రంగా ప్లాంట్లు ఏర్పాటు చేసి మినరల్ వాటర్ అంటూ ప్రజల ప్రాణాలతో జలగాటం ఆడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేమి ప్లాంట్లు నిర్వాహకులకు కలిసొస్తోంది. కొందరు ప్లాంట్ల నిర్వాహకులు వాటర్ క్యాన్లనూ సరిగా శుభ్రం చేయడం లేదు. మూడు నెలలు దాటితే ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నా.. ఏళ్ల తరబడి పాతవాటినే వినియోగిస్తున్నారు. మూడు నెలలకోసారి మార్చాలనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కాకినాడలో ఇటీవల పలు ఆర్వో ప్లాంట్లను నగర పాలక ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేశారు. నీటి శాంపిళ్లను సేకరించి విశాఖకు పంపించగా.. ప్లాంట్ల నిర్వహణ సరిగ్గా లేదని తేలింది.


ఇలా తెలుసుకోవచ్చు..

తాగునీరు సురక్షితమో.. కాదో ఇలా తెలుసుకోవచ్చు, ధర్మామీటర్‌ను పోలి ఉండే బోటల్ డిసాల్వ్ సాలిడ్స్(టీడీఎస్) పరికరం ద్వారా పరీక్లించవచ్చు. మార్కెట్లో ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. టీడీఎస్ స్థాయిని పార్ట్స్ పర్ మిలియన్( పీపీఎం) స్థాయిలో లెక్కిస్తారు.


ఇవీ చదవండి:

గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై మరో 0.25 శాతం కోత విధించిన ఆర్బీఐ

తెలంగాణాపై చలి పంజా.. ఇంకో నాలుగు రోజులు వణకాల్సిందే.!

Updated Date - Dec 05 , 2025 | 12:57 PM