Share News

Anantapur Police : ధార్‌ గ్యాంగ్‌ అరెస్టు

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:15 AM

కలకలం సృష్టిస్తున్న ధార్‌ గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం నగర శివారులోని విల్లాల్లో ఈ ముఠా...

Anantapur Police : ధార్‌ గ్యాంగ్‌ అరెస్టు

  • పోలీసుల అదుపులో ముగ్గురు

  • పరారీలో మరో ఇద్దరు

  • 59 తులాల ఆభరణాలు, రూ.19.35 లక్షల నగదు స్వాధీనం

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వరుస దోపిడీలతో కలకలం సృష్టిస్తున్న ధార్‌ గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం నగర శివారులోని విల్లాల్లో ఈ ముఠా గతనెలలో రూ.2.13 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను చోరీ చేసింది. దీంతో జిల్లా ఎస్పీ జగదీశ్‌ నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. ఆదివారం అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఎస్పీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లా టాండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన నారూ పచావర్‌, సావన్‌, మహబత్‌, మోట్ల గతనెల 21న రాత్రి అనంతపురంలో వెంకట శివారెడ్డి, రంజిత్‌రెడ్డి, శివశంకర్‌ నాయుడుకు చెందిన విల్లాల్లో చోరీ చేశారు. చోరీ సొమ్మును వాటాలేసి పంచుకున్నారు. పచావర్‌, సావన్‌ హైదరాబాద్‌, బెంగళూరులో సొత్తును విక్రయించే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన రమేశ్‌ను సంప్రదించారు. దీంతో అతను తన కుమారుడు సునీల్‌ను పంపాడు. చోరీ సమయంలో మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా పోలీసులు... అనంతపురం రాయల్‌నగర్‌లో ఉన్న పచావర్‌, సావన్‌, సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 59 తులాల బంగారు ఆభరణాలు, రూ.19.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తులో తమ వాటాలతో స్వగ్రామానికి వెళ్లిపోయిన మహబత్‌, మోట్లను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.


కాగా, ధార్‌ ముఠాలోని పచావర్‌, మహబత్‌ స్వయానా అన్నదమ్ములు. వారి మరో ముగ్గురు సోదరులు ప్రస్తుతం హైదరాబాద్‌ జైలులో ఉన్నారు. పచావర్‌పై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ల్లో 32, మహబత్‌పై 29కి పైగా కేసులు ఉన్నాయి. సావన్‌, మోట్ల కూడా పాత నేరస్తులే. సునీల్‌పై 9, అతడి తండ్రి రమేశ్‌పై ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌ల్లో 32 చొప్పున కేసులు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్‌లో 60 మంది వరకూ సభ్యులున్నారు. వీరంతా ధార్‌ జిల్లా పరిధిలో గ్రామాలకు చెందినవారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:15 AM