Dhanunjay Reddy SIT Probe: తెలీదు.. సంబంధం లేదు..

ABN , First Publish Date - 2025-05-16T04:00:23+05:30 IST

ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ విచారించినా సహకారం లేకుండా తెలీదు, "సంబంధం లేదు" అనే సమాధానాలే ఇచ్చారు.వీరిపై సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు విచారణతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Dhanunjay Reddy SIT Probe: తెలీదు.. సంబంధం లేదు..

  • ‘సిట్‌’ విచారణలో ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తీరిదీ

  • నేడు మరోసారి విచారణ

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు.. సంబంధం లేదు..’ అని మాత్రమే సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరి ముందస్తు బెయిలు పిటిషన్‌ సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు రానున్నందున అదేరోజు సిట్‌ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. బుధవారం 6గంటలకు పైగా సాగిన విచారణలో అధికారులకు నిందితులు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. దీంతో గురువారం ఉదయం 10.15 నుంచి రాత్రి 11.15 వరకూ దాదాపు 13 గంటల పాటు వీరిద్దరినీ సుదీర్ఘంగా విచారించారు. ఈసారి కూడా విచారణకు సహకరించకపోవడంతో కొన్ని ఆధారాలు ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వైఎస్‌ ప్రభుత్వంలో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేసిన ధనుంజయ్‌ రెడ్డికి అక్కడి కాంట్రాక్టర్‌తో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఆరా తీసింది. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఆ కాంట్రాక్టర్‌ ఏపీలో మళ్లీ జగన్‌ పాలనలో భారీగా లావాదేవీలు జరిపారు. అందులో అధిక భాగం ధనుంజయ్‌ రెడ్డికి చెందిన నల్లడబ్బేనని తెలుసుకున్న అధికారులు ఆ వివరాలు సైతం అడిగినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న ఆయన.. ‘సర్వీసులో ఎందరో పరిచయం అవుతుంటారు.. వాళ్లందరూ నాకు బినామీలు అవుతారా?’ అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.


రాయచోటి ప్రాంతానికి చెందిన శ్రీధర్‌ గుంటూరులో పాగావేసి 2019 నుంచి ఐదేళ్ల పాటు తాడేపల్లికి వచ్చిపోతూ చేసిన దందాలు, సంపాదించిన ఆస్తుల వివరాలు సేకరించిన సిట్‌ అధికారులు కర్ణాటక, తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడుల రహస్యం గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడి పేరుతో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన అధికారులు అందులో అనుమానాస్పద అంశాలపైనా ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణమోహన్‌ రెడ్డి ఎప్పుడెప్పుడు, ఎవరెవరితో మాట్లాడారు.. రాజ్‌ కసిరెడ్డి నుంచి తీసుకున్న డబ్బులు ఎక్కడి చేర్చారు.. తదితర కీలక సమాచారాన్ని ఇప్పటికే సేకరించిన సిట్‌... ఆ విషయాలను ఆయన నోటి నుంచి చెప్పించేందుకు చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదని తెలిసింది. దీంతో శుక్రవారం మరోమారు వీరిద్దరినీ విచారించి కీలక అంశాలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం విచారణ సందర్భంగా ఇద్దరి ఫోన్లను అధికారులు పరిశీలించి, తర్వాత తిరిగి ఇచ్చేశారు. అలాగే ధనుంజయ్‌రెడ్డి ఈ-మెయిల్‌ను కూడా పరిశీలించారు. కానీ కృష్ణమోహన్‌ రెడ్డి మాత్రం తన ఈ-మెయిల్‌ పాస్‌వర్డ్‌ చెప్పడానికి నిరాకరించారు. ఇద్దరినీ కలిపి కాసేపు, విడివిడిగా మరికొంతసేపు విచారించారు. ముందస్తు బెయిలుపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా దర్యాప్తు దిశ మార్చే అవకాశం ఉంది.

Updated Date - 2025-05-16T04:02:21+05:30 IST