Devineni Uma: ప్యాలెస్‌లో పడుకొని ఐదేళ్లు గాడిదలు కాశావా?
ABN , Publish Date - Jul 09 , 2025 | 09:53 PM
వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి నిప్పులు చెరిగారు. రైతుల పరామర్శ పేరుతో జగన్ చేస్తున్న యాత్రలపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్యాలెస్‌లో పడుకొని.. ఇప్పుడు ఇలా యాత్రలు చేయడం ఎంత వరకు సబబు అని వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.
అమరావతి, జులై 09: రైతుల పరామర్శ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న యాత్రలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని అమరావతిలో టీడీపీ నేత దేవినేని ఉమ విలేకర్లతో మాట్లాడుతూ.. వ్యూహకర్తలతో కలిసి డ్రామా రక్తి కట్టించాలన్న వైఎస్ జగన్ పన్నిన పన్నాగం బట్ట బయలైందన్నారు. జగన్ డ్రామాలు, ప్లాన్‌లను గమనించాలంటూ ప్రజలకు ఆయన సూచించారు. ముందస్తు వ్యూహంలో భాగంగాన ట్రాక్టర్లను సిద్ధం చేసి.. వైఎస్ జగన్ వచ్చిన వెంటనే రోడ్డుపై మామిడి కాయలను వైసీపీ కార్యకర్తలు పారబోశారని వివరించారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు.
రైతుల పరామర్శ పేరుతో ర్యాలీలు చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. జగన్ కుట్రలను తిప్పి కొట్టే సామర్థ్యం కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. 11 మంది శాసనసభ్యులతో సభలో ప్రశ్నించే ధైర్యం లేక ఈ తప్పుడు కార్యక్రమాలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టాడంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులకు కిలోకు రూ.4 సాయం చేస్తామన్నారు. కోకో, బర్లీ పొగాకు రైతులను సైతం ఆదుకున్నామని ఈ సందర్బంగా గుర్తు చేశారు. గతంలో కిలో మామిడి రూ. 2 అయితే ఆ సమయంలో ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను దేవినేని ఉమ సూటిగా ప్రశ్నించారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో పడుకొని ఐదేళ్లు గాడిదలు కాశావా? ఈరోజు నీకు రైతులు గుర్తుకొచ్చారా? అంటు వైఎస్ జగన్‌కు ఉమ చురకలంటిచారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌కు వచ్చింది.. రప్పా రప్పా గంజాయి బ్యాచ్‌తో జిందాబాద్‌లు కొట్టించుకోవడానికా? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా నిలదీశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌తో డ్రామా.. సత్తెనపల్లిలో బెట్టింగ్ బ్యాచ్‌తో సింగయ్యను పొట్టన పెట్టుకున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు మెయిల్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ 200 దేశ, విదేశీ కంపెనీలకు మెయిల్స్ పెట్టారని వివరించారు. నువ్వు ఎంత విషం చిమ్మినా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మాత్రం ఆగవని వైఎస్ జగన్‌కి దేవినేని ఉమ స్పష్టం చేశారు.
నువ్వు దోచుకున్న నగదు లెక్కలన్నీ చర్చకు వస్తాయని పిరికితనంతో అసెంబ్లీకి రావడం లేదంటూ జగన్‌పై మండిపడ్డారు. మీ కుట్రలు పన్నాగాలని తెలిసే చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రైతులను ఆదుకున్నారని వివరించారు. ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి.. ఏనాడైనా రైతులను ఆదుకున్నావా? అంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. 48 గంటల్లో ధాన్యం బకాయిలు చెల్లించి రూ. 1000 కోట్ల బకాయిలను వెంటనే కట్టమని కేబినెట్ ఈ రోజు నిర్ణయించిందని గుర్తు చేశారు. పోలీసులను రాక్షసులు అంటున్నావు ! గత ఐదేళ్లు ఇదే పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు.
ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రే స్వయంగా స్పందించి చర్యలు తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం విషం చిమ్మాలని కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లతో మీకు బుద్ధి చెప్పినా.. మళ్లీ పిచ్చి కూతలు, దౌర్భాగ్యపు నీచపు మాటలు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. మాజీ శాసనసభ్యుడు మాట్లాడిన నీచపు మాటలు జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన సాక్షి ఛానల్ పత్రికలో కనీసం ఖండించిన పాపాన పోలేదన్నారు. మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్బంగా దేవినేని ఉమ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
మంత్రి లోకేష్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు భేటీ
For More Andhrapradesh News and Telugu News