Share News

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 08:25 PM

చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ బుధవారం రాజధాని అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి.. వివిధ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
AP Cabinet meeting in amaravati

అమరావతి, జులై 09: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్ల సమావేశంలో వివరించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారుల భవనాలను సత్వరం పూర్తి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల నివాస భవనాలు పూర్తి చేయడం కోసం నిధుల మంజూరుకు సైతం ఈ కేబినెట్‌లో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

భవనాలు మిగిలిన పనుల పూర్తి చేసేందుకు రూ. 524.7 కోట్లు నిధుల మంజూరుకు పరిపాలన పరమైన ఆమోదం చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాలు భూములు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు 32. 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. అలాగే గెయిల్, అంబికా సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూమిని రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు.


ఇక కృష్ణానదీలో ప్రకాశం బ్యారేజీ ముందు ఇసుక క్వారీయింగ్ కోసం రూ. 250.2 కోట్లు పరిపాలన పరంగా ఆమోదించామని చెప్పారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి క్వారీయింగ్‌ను ఏపీ సీఆర్డీఏ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. జల వనరుల శాఖలో గత ప్రభుత్వం పక్కన పెట్టిన 71 పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందన్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్దికి రూ. 1000 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఎయిర్‌పోర్టులు లీజుకు ఇవ్వడం.. పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ అప్పులు చెల్లించాలని నిర్ణయించామని చెప్పారు.


హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించామన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు.. అలాగే ఈ మిషన్ కింద రూ.10 వేల కోట్ల రుణం ద్వారా నిధుల సమీకరించే ప్రతిపాదనకు సైతం ఆమోదం తెలిపినట్లు వివరించారు. సరకు రవాణా వాహనాలపై గత వైసీపీ ప్రభుత్వం రూ. 20 వేల వరకు పెంచిన గ్రీన్ టాక్స్‌ను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ గ్రీన్ టాక్స్‌ను రూ. 1500-3000 వరకు తగ్గిస్తూ రవాణాశాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్ సెంటర్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ అభివృద్ది కోసం ప్రకటించిన పాలసీకి పచ్చ జెండా ఊపినట్లు తెలిపారు.


రామాయపట్నంలో భూ సేకరణ కోసం ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 1,575 పింఛన్లను పునరుద్దరించాలని నిర్ణయించామన్నారు. మార్క్‌ఫెడ్ తీసుకున్నరూ. 6, 700 కోట్లు రుణానికి అదనంగా రూ. 1000 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు.


కిలోకు రూ. 4 చొప్పున రూ. 260 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించిందన్నారు. రైతులకు ధాన్యం సేకరణ నగదు చెల్లించేందుకు రూ. 672 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపామన్నారు. గురువారం రైతుల ఖాతాలో ధాన్యం కొనుగోలు నగదు జమ చేయాలని నిర్ణయించిందని చెప్పారు. రెండో విడత భూ సమీకరణపై ప్రజలతో పలుమార్లు సంప్రదించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వివరించారు. భూ సమీకరణ చేసేందుకు అవసరాన్ని, పరిస్ధితిని రైతులను కలిసి వివరించాలని నిర్ణయించామన్నారు.


రైతుల సందేహాలను నివృత్తి చేసి.. వారు ఒప్పుకున్నాకే భూ సమీకరణ చేయాలని తమకు సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందకుండా ప్రతిపక్షం చేస్తోన్న కుట్రలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మంత్రులుగా తమపై ఉందని సీఎం ఈ సందర్భంగా తమకు సూచించారని చెప్పారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తమకు స్పష్టంగా ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.

Updated Date - Jul 09 , 2025 | 08:25 PM