AP News: హార్సిలీహిల్స్ అభివృద్ధిని పట్టించుకునేదెవరో...
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:12 AM
ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు.
- ఉన్నతాధికారుల బదిలీతో పనులపై అనుమానాలు
- అతీగతీలేని ఒబెరాయ్ హోటల్.. పతంజలి వెల్‌నెస్ సెంటర్
- అడుగుముందుకు పడని క్రీడా శిక్షణా కేంద్రం పనులు
బి.కొత్తకోట(అన్నమయ్య): ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్(Horseley Hills) అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు. అయితే వారి బదిలీలతో ఇక బ్రేక్ పడినట్టే అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకశాఖ హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది పరిస్థితి.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హార్సిలీహిల్స్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం, తగిన నిధులు మంజూరు కాకపోవడం, ఆ అధికారులు బదిలీపై వెళ్లడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లైంది. క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా హార్సిలీహిల్స్‌లోని క్రీడా శిక్షణా కేంద్రం పనులు అడుగుముందుకు పడకపోవడం కూడా విస్మయం కలిగిస్తోంది.
అతీగతీలేని ఒబెరాయ్.. పతంజలి
హిల్స్‌పై రూ.200 కోట్లతో ఒబెరాయ్ హోటల్ నిర్మిస్తామని చెప్పిన సంస్థకు ప్రభుత్వం 19.80 ఎకరాల భూమి కేటాయించి ఏళ్లు గడుస్తున్నా అది పెండింగ్‌లో ఉండటంతో రెండుసార్లు ఆ సంస్థ ప్రతినిధులను రప్పించి హిల్స్‌లో హోటల్ స్థాపనకు అనుకూలతలను జిల్లా అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా వారి నుంచి సానుకూల సమాచారం లేదు. పతంజలి సంస్థ ద్వారా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు స్థలం, ఓ భవనం కేటాయించారు. ఆ సంస్థ అధినేత బాబా రాందేవ్ స్వయంగా వచ్చి హిల్స్ వాతావరణం, అనుకూలతలను పరిశీలించారు. ఈ రెండు నిర్మాణాలు జరిగితే హార్సిలీహిల్స్ జాతీయస్థాయి గుర్తింపుతో పాటు, ఉన్నతస్థాయి పర్యాటకుల సందర్శన, ఆదాయం పెరుగుతుందని భావించారు. అయితే వాటిపై అతీగతీ లేదు. ఈ విషయమై పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

అడుగు ముందుకు పడని క్రీడా శిక్షణా కేంద్రం..
జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో భాగంగా క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శాప్‌కు 3.74 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.3.20 కోట్ల నిధులనూ విడుదల చేశారు. వాటిలో రూ.2.20 కోట్లు ఖర్చు చేసి ప్రహరీని నిర్మించారు. మిగిలిన నిధులు మురిగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్రీడా శిక్షణా కేంద్రం పనులు చేయడం అటుంచి, ఇందులో 2 ఎకరాలను సినీ దర్శక నిర్మాత మహీ రాఘవకు కట్టబెట్టేందుకు విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో రూ.కోట్ల విలువైన స్థలం మిగిలింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జిల్లాకే చెందిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి క్రీడల శాఖా మంత్రిగా ఉన్నారు. నిధులు మంజూరు చేయించి క్రీడా శిక్షణను ప్రారంభిస్తే, ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారు కావడంతో పాటు హార్సిలీహిల్స్‌కు మరింత గుర్తింపు వస్తుంది.
సుందరీకరణ పనులైనా సాగేనా?
ఆశించిన విధంగా ప్రధాన ప్రాజెక్టుల స్థాపనకు బీజం పడకపోవడంతో అందుబాటులో ఉన్న నిధులతో పర్యాటకుల ఆకర్షణకు ఇటీవలి వరకు పనిచేసిన కలెక్టర్, ఆయన ఆదేశాల మేరకు టౌన్‌షి్‌ప కమిటీ చైర్మన్ హోదాలో మేఘస్వరూప్ పలు సుందరీకరణ పనులను చేపట్టారు. హిల్స్ ముఖద్వారం, హరితసర్కిల్, జిడ్డు క్రిష్ణమూర్తి సర్కిల్, వివేకానంద స్టాచ్యు, గాలిబండలపై సుందర నిర్మాణాలు చేపట్టారు. అన్ని సర్కిళ్లను కలుపుతూ వాకింగ్‌ట్రాక్‌కు అంచనాలు వేశారు.
అయితే పనులు మొదలు కాలేదు. ఇకపై కొనసాగుతాయా అనే అనుమానం కూడా మొదలైంది. ఘాట్‌రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు మొదలుకాలేదు. పర్యాటకుల రక్షణ కోసం కొండపై ఏర్పాటు చేసిన ఔట్‌పోస్ట్, దిగువ భాగంలో వాహనాల తనిఖీల కోసం ఏర్పాటైన పోలీస్ చెక్‌పోస్ట్ సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత జిల్లా అధికారులు హిల్స్‌ను సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని, నిధులు మంజూరు చేయించి హార్సిలీహిల్స్ రూపురేఖలు మార్చాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల బదిలీతో బ్రేక్
ప్రముఖ సంస్థ ఒబెరాయ్‌తో హోటల్ నిర్మాణం కోసం ఆ సంస్థ ప్రతినిధులను ఒప్పించే క్రమం, పతంజలి సంస్థ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు, పీకేఎం ఉడా-టౌన్‌షి్‌ప కమిటీ నిధులతో పర్యాటకులను ఆకట్టుకునే సుందరీకరణ పనుల నిర్మాణం, ఘాట్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం చేయడంలో ఇటీవలి వరకు ఇక్కడ పనిచేసిన కలెక్టర్ చామకూరి శ్రీధర్, మదనపల్లి సబ్‌కలెక్టర్ మేఘస్వరూ్‌పల కృషి ఎనలేనిది. పలుమార్లు హిల్స్‌లో పర్యటించి అభివృద్ధికి ప్రయత్నం చేశారు. పలమనేరు-మదనపల్లి-కుప్పం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ, టౌన్‌షి్‌ప కమిటీ నిధులతో ప్రధాన కూడళ్లలో సుందర నిర్మాణాలు, కొండను చుట్టేస్తూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పనులు పూర్తవగా వాకింగ్‌ట్రాక్‌తో పాటు మరికొన్ని జరగాల్సి ఉంది. ఘాట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News