Deputy CM Pawan: ఎన్ని ఇబ్బందులొచ్చినా విడిపోం!
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:02 AM
ఇది నా గురించో, చంద్రబాబు, లోకేశ్ గురించో కాదు! మేం ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతాం.

మా కోసం కాదు.. రాష్ట్రం కోసం కలిసే ఉంటాం
మరో 15 ఏళ్లు మాదే అధికారం
అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మేమే
గవర్నర్ ప్రసంగిస్తుంటే గొడవ చేస్తారా?
వారు పేపర్లు విసిరినప్పుడు వివేకా హత్య గుర్తొచ్చింది
వైసీపీని భరించిన చంద్రబాబుకు హ్యాట్సాఫ్
గవర్నర్‌ను గౌరవించని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు
వైసీపీపై పవన్ ధ్వజం
సభ సాక్షిగా మోదీకి థ్యాంక్స్
ఇబ్బందులుంటే మనం ఒక మాట అనుకుందాం. కానీ మన కమిట్‌మెంట్ ప్రజలేనన్నది గుర్తుంచుకోవాలి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం కట్టుబడి ఉంటాం. దేశం కోసం ప్రాణమిస్తాం.
- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఒక సవాల్. రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చాలా మంది చాలా వ్యాఖ్యలు చేసినా ఎందుకు కలిసుంటామని చెబుతున్నామంటే.. ఇది నా గురించో, చంద్రబాబు, లోకేశ్ గురించో కాదు! మేం ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతాం. అందుకే మాటిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటాం’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కింద పడతాం, మీద పడతాం. అవి మా ఇంటి విషయాలు. కూటమి విషయాలు. ఒక మాట అనొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ.. సభలో అడుగు పెట్టకూడదు. మా కంటే మరొక సీటు అదనంగా వచ్చినా మీకు (వైసీపీకి) ప్రతిపక్ష హోదా వచ్చేది. కానీ ప్రజలు మీకా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మనమే అధికార పార్టీ. మనమే ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇతర పార్టీ నుంచి గెలిచిన అంబేడ్కర్‌ను న్యాయశాఖ మంత్రిని చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీని కేబినెట్‌లో చేర్చుకున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్‌తో నెహ్రూ అనేక నిర్ణయాలపై విభేదించేవారు. ఆ తర్వాత వాజపేయి, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్.. ఇలా విభిన్న పక్షాలు ఏకమయ్యాయి. ఏపీది కూడా స్వాతంత్య్రం తర్వాతి పరిస్థితే. మా పార్టీ, కూటమి.. పాతతరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాయి. స్వాతంత్య్రం సమయంలో కేంద్రంలో సెంట్రల్ రీకన్సిలియేషన్ కేబినెట్ ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కూడా స్టేట్ రీకన్సిలియేషన్ కేబినెట్‌లాంటిదే. ప్రతిపక్షంగా ఉండాల్సిన వారు ముఖం చాటేస్తే అధికార, ప్రతిపక్షం రెండూ మేమే. మనందరి లక్ష్యం వికసిత్ ఆంధ్రప్రదేశ్’ అని స్పష్టంచేశారు.
విపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు..
వైసీపీకి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పవన్ అన్నారు. అది ఎవరో ఇచ్చేది కాదని, అందువల్ల ఆ పార్టీకి ఆ హోదా రాదని స్పష్టంచేశారు. ఆ హోదా కావాలంటే జర్మనీ దేశంలో అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలంతా ఫ్లయిట్ టికెట్లు ఇప్పిస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీలో జరిగే గొడవలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కొన్ని గొడవలు చూశాను. అప్పుడు విభేదించడానికి కారణం ఉంది. ఇప్పుడు విభేదించడానికి ఏముంది? రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ ప్రసంగిస్తుంటే ఇలాగేనా వ్యవహరించేది? మనమే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ప్రజలకేం చెబుతాం. ఇక్కడ గొడవలకు కేసులు ఉండవు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. అదే ఆయన (గవర్నర్ అబ్దుల్ నజీర్) సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడైతే ధైర్యం చేయగలరా? కళ్లలోకి చూడగలరా’ అని నిలదీశారు.
మేం వచ్చాక ఎన్నో చేశాం..
వైసీపీ ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని.. రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం కోల్పోయేలా చేసిందని పవన్ విమర్శించారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకేరోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. మూడు నెలల్లో ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించాం. వైసీపీ ఐదేళ్లలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే, మేం ఆరు నెలల్లో 4,300 కిమీ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. వాళ్ల హయాంలో 268 మినీ గోకులాలు కడితే.. మేం ఇప్పటికే 22,500 గోకులాల నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం రూ.వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకుంది. కూటమి ప్రభుత్వం నెల రోజుల్లోనే రూ.వెయ్యి పెంచింది. అటవీ ప్రాంతాల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కుంకీ ఏనుగులు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం పచ్చదనం లక్ష్యంగా పనిచేస్తున్నాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన ఏనుగుల దాడి ఘటనపై సమీక్షించాం. అక్కడ షార్ట్‌కట్ దారిని ఎంచుకోవడం వల్ల ఏనుగు దాడి చేసింది. అందుకే అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రభుత్వం నిర్దేశించిన దారుల్లోనే ప్రయాణించాలి. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వాకంతో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకున్న కర్ణాటక ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసింది. మేం వచ్చాక తొలిసారి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశాం. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా సీఎం రూ.35 కోట్లు విడుదల చేశారు. దాంతో మొదటిసారి అక్కడ ప్రజలు అంబులెన్స్ శబ్దం విన్నారు. వారికి డోలీ కష్టాలు తీరాయి’’ అని అన్నారు.
ప్రధానికి ధన్యవాదాలు
‘విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది చనిపోయారు. అన్ని ప్రాంతాల వారు ఇందులో ఉన్నారు. ఆ రోజు ప్రైవేటీకరణ ప్రకటన చేస్తే వైసీపీ వాళ్లు మద్దతు పలికారు. పైగా మమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూశారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి ఆలోచన విరమించుకోవాలని కోరాం. కానీ ఆరోజు అది అసాధ్యమని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆంధ్రులకు కులాల భావన తప్ప ఆంధ్రులు అనే భావన తక్కువ. కానీ అందరూ ఆంధ్రులుగా భావించేది విశాఖ స్టీల్ ప్లాంట్. దాని ప్రైవేటీకరణను నిలుపుదల చేసినందుకు ప్రధాన మోదీకి ధన్యవాదాలు. అలాగే పలు పథకాలకు రాష్ర్టానికి నిధులు కేటాయించారు’ అని పవన్ చెప్పారు.
చంద్రబాబు ఇన్నేళ్లు ఎలా భరించారో!
బూతులు, గొడవలకు వైసీపీ పర్యాయపదంగా మారిందని పవన్ మండిపడ్డారు. ‘ఇన్నేళ్లూ ఇలాంటివారిని చంద్రబాబు ఎలా భరించారో! ఆయనకు హాట్సాఫ్. వారు పేపర్లు విసిరినప్పుడు వివేకానందరెడ్డి హత్య గుర్తొచ్చింది. 200 ఆలయాల విధ్వంసం గుర్తొచ్చింది. డాక్టర్ సుధాకర్ చనిపోవడం గుర్తొచ్చింది. చివరికి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది. జడ్జిలను సోషల్ మీడియాలో తిట్టిన విషయం, పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చాయి. వారు సభలోనే ఇలా ప్రవర్తిస్తున్నారంటే మరి బయటా..! గవర్నర్‌లాంటి ఉన్నతమైన వ్యక్తి ఆరోగ్యం బాగాలేకపోయినా విజయవంతంగా ప్రసంగించారు. ఆయన్ను వైసీపీ సభ్యులు ఇబ్బంది పెట్టారు. చట్టసభలు దేవాలయం లాంటివి. వారు గవర్నర్ పట్ల సరిగా వ్యవహరించలేదు. అందుకు మా తప్పు లేకపోయినా ప్రభుత్వం తరఫున ఆయనకు క్షమాపణలు చెబుతున్నాం. గవర్నర్‌ను గౌరవించనివాళ్లు వచ్చే ఎన్నికల్లో మళ్లీ సభలోకి రాకూడదు’ అని తేల్చిచెప్పారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని పవన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబునే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. లోకేశ్‌ను జైల్లో పెట్టాలని చూశారు. అచ్చెన్నాయుడిని జైలుకు పంపారు. ఎంత మంది ఇబ్బంది పడ్డారని అడిగితే ఈ సభలో 90 శాతం చేతులెత్తారు’ అని చెప్పారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా సభకు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకూడదనుకున్నామని... వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇద్దామనుకున్నామని పవన్ తెలిపారు. ఎవరైనా ఏదైనా అన్నా సీఎం సున్నితంగా మందలించారన్నారు.