Share News

Deputy CM Pawan Kalyan : టీటీడీలో ప్రక్షాళన జరగాలి

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:53 AM

టీటీడీ పాలక మండలికి సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

 Deputy CM Pawan Kalyan : టీటీడీలో ప్రక్షాళన జరగాలి

  • వీఐపీ సంస్కృతి నుంచి బయటపడాలి

  • సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలి

  • అధికారుల వైఫల్యం వల్లే తొక్కిసలాట

  • ఈవో, ఏఈవోలు బాధ్యత తీసుకోవాలి

  • పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది

  • తప్పునకు పూర్తి బాధ్యత వహిస్తున్నాం

  • క్షమాపణ చెబుతున్నా: డిప్యూటీ సీఎం పవన్‌

  • తిరుపతిలో క్షతగాత్రులకు పరామర్శ

తిరుపతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): టీటీడీ పాలక మండలికి సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతోందని, భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామన్నారు. టీటీడీలో ఈ ఘటన జరగడం వ్యక్తిగతంగా తనను చాలా బాధపెట్టిందని, క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను గురువారం స్విమ్స్‌లో ఆయన పరామర్శించారు. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌, ఈవో, ఏడీఈవోల మధ్య గ్యాప్‌ ఉన్నట్టు తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాల ఇళ్లకు పాలకమండలి సభ్యులు వెళ్లి పరామర్శించాలని సూచించారు. ‘కొండపై వీఐపీ సంస్కృతి ఆగిపోవాలి. అక్కడి అధికారులు కామన్‌మ్యాన్‌ ఫోక్‌సకు రావాలి. ఏకాదశి టోకెన్ల జారీలో 1100 మంది పోలీసులు, వంద మందికి పైగా పోలీస్‌ అధికారులు బందోబస్తు చేసినా ఇలాంటి దుర్ఘటన జరగడం విచారకరం. పోలీసులు ఉన్నారా? అంటే ఉన్నారు.


ఇలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ కనిపించలేదు. క్రౌడ్‌ మేనేజ్మెంట్‌ ఇప్పటికీ పోలీసులకు అలవాటు కాలేదు. నా కళ్లముందు ఇప్పుడే చూశా. మీడియా సమావేశం పెట్టేందుకు జనసమూహం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకుని పోలీసులకు చెబితే కానీ జనాన్ని నియంత్రించలేకపోతున్నారు. గరుడసేవలో 4 లక్షల మంది భక్తులు వస్తే ఎలాంటి దుర్ఘటనలు జరగనప్పుడు, బైరాగపట్టెడ కేంద్రంలో 2,500 మంది వస్తే ఎందుకు జరిగింది? ఈవో, ఏడీఈవోలు బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఇది. భక్తులకు మెరుగైన సేవలందించడం మీ బాధ్యత. ఈ రోజు టీటీడీ అధికారులు విఫలమయ్యారు. మీరు సరిగ్గా చేయకపోవడం వలనే సీఎంతో పాటు నేను, ప్రభుత్వం మాట పడాల్సి వస్తోంది.

తప్పు జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడు, పోలీస్‌ అధికారులు క్షమాపణ చెప్పి సంతాపం ప్రకటించాలి. తెల్ల్లవారుజామున ఇచ్చే టికెట్ల కోసం ఎందుకు అన్ని గంటల పాటు కూర్చోబెట్టారు. తప్పు ఎక్కడ జరిగింది? పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదు? బైరాగపట్టెడ కేంద్రంలో ఎందుకు లైట్లు ఏర్పాటు చేయలేదు? భవిష్యత్తులో తొక్కిసలాట ఘటనలు జరగకుండా చూస్తాం. టీటీడీ అధికారులూ.. మనకు కావాల్సింది సగటు భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లడం. ఇప్పటికైనా మేల్కొండి’ అని పవన్‌ అన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 03:53 AM