Weather: రాష్ట్రాన్ని కమ్మేసిన పొగమంచు!
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:03 AM
రాష్ట్రాన్ని పొగమంచు కప్పేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ అన్ని ప్రాంతాల్లో మంచు దట్టంగా కురవడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు...

అమరావతిలో విజిబిలిటీ ‘సున్నా’
గ్రామీణ ప్రాంతాల్లో 100 మీటర్ల లోపే
విశాఖ, బెజవాడల్లో విమానాల రాకపోకలకు అంతరాయం
నేడు, రేపు పొగమంచు ప్రభావం
విశాఖపట్నం, గన్నవరం, రాజమహేంద్రవరం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని పొగమంచు కప్పేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ అన్ని ప్రాంతాల్లో మంచు దట్టంగా కురవడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజిబిలిటీ బాగా తగ్గిపోవడంతో 100 మీటర్ల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించలేదు. పొగమంచు ప్రభావంతో ఉదయం విశాఖపట్నం, విజయవాడల్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయింది. శివారు ప్రాంతాల్లో 100 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అమరావతిలో విజిబిలిటీ ‘సున్నా’గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 8గంటల వరకు అమరావతి పరిసరాల్లో పొగమంచు దట్టంగా కురవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుండగా గాలులు నిశ్చలంగా ఉండడం (వేగం మందగించడం), ఆకాశం నిర్మలంగా ఉండడం, తెలంగాణ, కోస్తా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో అధికపీడనం కొనసాగడంతో పొగమంచు దట్టంగా కురిసిందని వాతావరణ అధికారి ఎస్.జగన్నాథకుమార్ పేర్కొన్నారు. రానున్న రెండు రోజులు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
నాలుగు విమానాలు ఆలస్యం
దట్టమైన మంచు కారణంగా ఉదయం విశాఖపట్నం రావలసిన, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచువల్ల పైలట్లకు రన్‌వే సరిగ్గా కనిపించకపోవడం, ఇనుస్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా ఆలస్యమయ్యాయి. విశాఖ నుంచి ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్ బయలురాల్సిన విమానం గంటన్నర ఆలస్యంగా వెళ్లింది. హైదరాబాద్‌కు 8.45 గంటలకు వెళ్లాల్సిన మరో విమానం 2.45 గంటలు ఆలస్యంగా వెళ్లింది. విశాఖ నుంచి 8.55 గంటలకు విజయవాడ బయలురాల్సిన విమానం 3.05 గంటలు ఆలస్యంగా వెళ్లింది. విశాఖ నుంచి ఉదయం 8.25 గంటలకు చెన్నై బయలుదేరాల్సిన విమానం 1.50 గంటలు ఆలస్యంగా వెళ్లిందని విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు.
విజయవాడ విమానం.. రాజమండ్రికి..
పొగమంచు కారణంగా విజయవాడ నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం ఉదయం 7.05కు హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం అదే సమయానికి వచ్చినప్పటికి విజిబిలిటీ లేక గాలిలో చక్కర్లు కొడుతూ నూజివీడు వరకూ వెళ్లింది. ఆ సమయానికి ఫ్యూయల్ తక్కువగా ఉండటంతో రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లి 8.30కు ల్యాండ్ అయ్యింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ ఇండిగో విమానం రన్‌వే పైనే ఉంది. తిరిగి 10.30కి గన్నవరంలో ల్యాండింగ్ అయ్యింది. అలాగే, మరో మూడు విమానాలను ముందుగానే బెంగళూరు, చెన్నైలో నిలిచిపోయి మంచు తగ్గిన తర్వాత వచ్చాయి. విమానాల ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం..
Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..
Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు
Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
For AndhraPradesh News And Telugu News