Share News

CID : కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

ABN , Publish Date - Jan 24 , 2025 | 09:25 PM

TG CID: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ప్రకటించారు.

CID : కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
TG Minister Damodar Raja Narasimha

హైదరాబాద్, జనవరి 24: కిడ్నీ రాకెట్ తరహా చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరిని కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆయన ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి రాజనర్సింహ సూచించారు.

సరూర్ నగర్‌లో కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై శుక్రవారం తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై వైద్యుల కమిటీ ఇచ్చిన ప్రాధమిక నివేదినకు ఆయన పరిశీలించారు. అనంతరం ఈ కేసు పూర్వపరాలను సైతం మంత్రి సమీక్షించారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.

Also Read: విజయసాయిరెడ్డి రాజీనామా.. వైసీపీలో అశాంతి


ఇక అలకనంద హాస్పిటల్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని ఈ సందర్భంగా మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ రాకెట్‌తో సంబంధం ఉందని తెలిపారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని.. వారిని మభ్యపెట్టి ఈ కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారని మంత్రికి ఉన్నతాధికారులు సోదాహరణగా వివరించారు.

Also Read: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్


ఈ ఆసుపత్రిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని.. కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని ఈ సందర్భంగా ఆయనకు అధికారులు వెల్లడించారు. మరోవైపు కిడ్నీ రాకెట్‌కు వేదికగా మారిన అలకనంద హాస్పిటల్‌ను సీజ్ చేశామని, హాస్పిటల్‌ ఓనర్‌‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి అధికారులు తెలియజేశారు. ఈ కేసులో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..


గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అన్న విషయంపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఆ దిశగా సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు.

Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు


అలాగే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే.. ఇతర‌ సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?


ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్‌ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్‌ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

For Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 09:28 PM