Share News

Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:17 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నానానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వివరించారు.

Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
Heavy Rains

అమరావతి, ఆగస్ట్ 17: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆదివారం అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నానానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వివరించారు.


దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. అదే విధంగా లోతట్టు ప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు.


ఇక ఈ వాయుగుండం ఈనెల 19వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ క్రమంలో విశాఖ, అనకాపల్లి, బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

For More AP News And Telugu News

Updated Date - Aug 17 , 2025 | 08:02 PM