Cooking Oil Price Hike: వంటబట్టని నూనెలు.. పెరుగుతున్న వంటనూనెల ధరలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:14 PM
వంటనూనెల ధరలు సలసలా మరిగిపోతున్నాయి. డిమాండ్ -సరఫరాను క్యాష్ చేసుకునేందుకు డీలర్లు, ఏజెన్సీలు ధరలను క్రమేణా పెంచేస్తున్నారు. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ధరల్లో ఎక్కువ పెరుగుదల కనిపిస్తుండగా, పామాయిల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. జీఎస్టీ మినహాయింపులు లేకపోవటంతో (పాత జీఎస్టీ 5 శాతం మాత్రమే) ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ: గత సెప్టెంబరులో నిలకడగా ఉన్న వంటనూనెల ధరలు సంక్రాంతి సమీపిస్తున్న సమయంలో క్రమేణా పెరుగుతున్నాయి. దిగుమతి పేరుతో సన్ఫ్లవర్ ఆయిల్స్ ధరలు పెంచేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సందర్భంలో సరఫరా తక్కువగా ఉందన్న వాదనలను తెరపైకి తెస్తూ ఏజెన్సీలు ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. దీనిని కప్పిపుచ్చుకోడానికి తెలివిగా రూపాయితో డాలర్ విలువ పెరిగిందన్న వాదనను తెస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ దిగుమతిపైనే ఆధారపడి ఉంటాయి. మలేషియా, రష్యా, ఉజ్బెకిస్తాన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో డాలర్లలో మనమేమీ డబ్బు చెల్లించట్లేదు. రూపాయిల్లోనే చెల్లిస్తున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు అవకాశమే లేదు. కానీ, ఏజెన్సీలు ఈ వాదనలు తెలివిగా తెస్తున్నాయి. డీలర్లు మాత్రం ఈ మాటలు చెప్పట్లేదు. పండుగల నేపథ్యంలో హోల్సేల్, రిటైల్ మార్కెట్కు సరఫరా చేసే ఏజెన్సీలు ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
పెరుగుదల ఇలా:
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలంతా సన్‌ఫ్లవర్ ఆయిల్స్ లో ఎక్కువగా ఫ్రీడమ్, ఫార్చ్యూన్, గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకెట్లను వినియోగిస్తారు. ఈ నూనె ప్యాకెట్లపై సెప్టెంబరులో ఎమ్మార్పీ రూ.185 ఉండగా, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతోంది. ఈ ఎమ్మార్పీపైనే సెప్టెంబరులో ఫ్రీడమ్ ఆయిల్ రూ.140, గోల్డ్ డ్రాప్ రూ.135కు విక్రయించారు. ప్రస్తుతం కూడా ఎమ్మార్పీ రూ.185లే ఉండగా, హోల్సేల్ వ్యాపారుల వద్ద మాత్రం ఫ్రీడమ్ ఆయిలు రూ.153కు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో కూడా ఇంచుమించు అదే ధరను ప్రదర్శిస్తున్నారు. సెమీ హోల్ సేల్ వ్యాపారులు రూ.155కు విక్రయిస్తున్నారు. రిటైల్లో ఇదే ఫ్రీడమ్, ఫార్చ్యూన్ ఆయిల్స్ రూ.160పైనే ఉన్నాయి. మండల, గ్రామీణ స్థాయిలో ఇంకా పెంచే విక్రయిస్తున్నారు. మొత్తంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్లపై రూ.10 నుంచి రూ.15 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఏజెన్సీలు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచుతున్నారని తెలుస్తోంది. ఈ ధరల పెరుగుదలకు చెప్పే కారణాలు.. తక్కువ పరిమాణంలో నిల్వల దిగుమతి, డాలర్ ప్రభావం.
పామాయిల్ ప్యాకెట్లు చిన్నబోతున్నాయి..!
పేదలు ఎక్కువగా వినియోగించే పామాయిల్ ప్యాకెట్లు చిన్నబోతున్నాయి. లీటరు వంటనూనె ప్యాకెట్‌పై స్టాండర్డ్స్ ప్రకారం నికర పరిమాణం 910 గ్రాములుగా ఉండాలి. దీనిని ప్యాకెట్‌పై స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ, ప్రస్తుతం 750, 790, 850 గ్రాముల నికర పరిమాణంతో కూడిన ప్యాకెట్లు వస్తున్నాయి. వినియోగదారులు తెలుసుకోలేని విధంగా కంటికి కనిపించని విధంగా డిజిటల్ ప్రింటింగ్ వేస్తున్నారు. రూ.100కు అందుబాటులో ఉండే పామోలిన్ ప్యాకెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వీలుగా డీలర్లు ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. రిటైల్‌గా విక్రయించే సందర్భంలో లీటరు ధరలను వసూలు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ల ఎమ్మార్పీ రూ.125 ఉండగా, రూ.113-రూ.118 మధ్య విక్రయిస్తున్నారు. 790 ఎంఎల్ ప్యాకెట్ అయితే ఎమ్మార్పీ రూ.115 ఉండగా, రూ.108కు విక్రయిస్తున్నారు. 750 ఎంఎల్ ప్యాకెట్‌పై రూ.108 ఎమ్మార్సీ ఉండగా, రూ.103కు విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
జగన్ పుట్టినరోజు వేడుకలపై తీవ్రంగా స్పందించిన యనమల