Share News

Municipal Corporation : నారాయణ.. నారాయణ!

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:04 AM

వైసీపీ హయాంలో అడ్డగోలుగా పదోన్నతులు పొందిన ఓ మహి ళా అధికారిని కూటమి ప్రభుత్వంలోనూ అందలం ఎక్కించారు.

Municipal Corporation : నారాయణ.. నారాయణ!

  • కూటమి ప్రభుత్వంలోనూ ‘వైసీపీ’ అధికారులకు అందలం

  • మంత్రి నారాయణ ఇలాకాలో మాధురిరెడ్డికి పోస్టింగ్‌

  • లేని పోస్టు సృష్టించి మరీ అప్పగించిన వైనం

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అడ్డగోలుగా పదోన్నతులు పొందిన ఓ మహి ళా అధికారిని కూటమి ప్రభుత్వంలోనూ అందలం ఎక్కించారు. మున్సిపల్‌ శాఖలోని అమృత్‌ విభాగంలో లేని డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టును సృష్టించి మరీ.. ఆమెను అందులో కూర్చొబెట్టారు. గత ప్రభుత్వంలో జగన్‌ పేషీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి వద్ద పనిచేస్తూ కీలకంగా వ్యవహరించిన మాధురిరెడ్డికి తగిన అర్హతలు లేకపోయినా అప్పట్లో పదోన్నతులు కల్పించారు. ఆఖరులో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా కూడా ఇప్పించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో అది మిస్‌ అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ తమ పరపతి తక్కువేమీ కాదంటూ చక్రం తిప్పుతున్నారు. మున్సిపల్‌ శాఖలో అమృత్‌ విభాగానికి ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు లేదు. అయితే నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమృత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టుకు మాధురిని నియమించినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఏదైనా కొత్త పోస్టు సృష్టించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. అలాంటిది ఆర్థికశాఖ అధికారులే.. లేని అమృత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులో మాధురిని నియమించడం విచిత్రంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా మంత్రి నారాయణ సొంత ఇలాకాలోని నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరగడంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగాయా? లేక మంత్రి అనుమతితోనే జరిగిందా? అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

Updated Date - Jan 18 , 2025 | 04:04 AM