Share News

CM Chandrababu Urges Boosting: స్థానిక సంస్థలకు చేయూత

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:47 AM

సొంత ఆదాయ వనరులు పెంచుకుని వేగంగా అభివృద్ధి సాధించడంపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు సీఎం చంద్రబాబు..

CM Chandrababu Urges Boosting: స్థానిక సంస్థలకు చేయూత

  • ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల విభజన

  • తక్కువ ఆదాయం ఉన్నవాటికి ప్రభుత్వ సాయం

  • ఆర్థిక వనరులు పెంచేలా ప్రత్యేక కార్యాచరణ

  • రాష్ట్ర ఆర్థిక సంఘం భేటీలో సీఎం చంద్రబాబు సూచన

  • పంచాయతీ రికార్డులు ఆన్‌లైన్‌ చేయండి: డిప్యూటీ సీఎం

  • ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం: రాష్ట్ర ఆర్థిక సంఘం

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): సొంత ఆదాయ వనరులు పెంచుకుని వేగంగా అభివృద్ధి సాధించడంపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల బలోపేతంపై ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి ఆధారంగా స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని, దీనివల్ల తక్కువ ఆదాయం ఉన్నవాటికి ప్రత్యేక సాయం అందించే అవకాశం ఉంటుందన్నారు. పంచాయతీలకు ఏటా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తే వాటికి ఏవిధంగా సాయం అందించాలి?, స్థానిక సంస్థల్ని ఏవిధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై విధివిధానాలు రూపొందించవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని, అయితే ఆమేరకు ఆస్తుల కల్పన జరుగుతున్నదో.. లేదో? పరిశీలించాలన్నారు. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు ప్రయత్నించాలన్నారు. పట్టణ స్థానిక సంస్థలనూ ఆర్థికంగా బలోపేతం చేస్తూ, మరిన్ని ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ప్రభుత్వాలు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించేవి స్థానిక సంస్థలని, దీనిని దృష్టిలో పెట్టుకుని వాటిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలని చెప్పారు. ఆర్థిక సంవత్సరం చివరికి పంచాయతీల్లో ఆడిటింగ్‌ పూర్తి చేయాలన్నారు.


ఆదాయాలు, బకాయిల లెక్క తేల్చండి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

2019 నుంచి 2024 మధ్య కాలంలో స్థానిక సంస్థల ఆస్తి పన్నుల వసూళ్లు, బకాయిల లెక్కలు తేల్చాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలను ఆన్‌లైన్‌ చేయాలన్నారు. గ్రామాల్లో పౌలీ్ట్ర పరిశ్రమలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని, గ్రామ ప్రజలకు, పౌలీ్ట్ర పరిశ్రమలకు ఇబ్బంది లేని విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. ఆదాయార్జన ప్రకారం స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. అయితే ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని ఆర్థిక సంఘం అధికారులు తెలిపారు.

ఖర్చులు.. ఆదాయం మధ్య భారీ వ్యత్యాసం

స్థానిక సంస్థల ఆదాయ వనరులు.. ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని 5వ ఆర్థిక సంఘం తన నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయం కన్నా జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకు ఖర్చు పెట్టే మొత్తం 111 శాతంగా ఉందని పేర్కొంది. 2025-26 నుంచి 2029-30 వరకు పంచాయతీరాజ్‌ సంస్థల రీసోర్స్‌ గ్యాప్‌ రూ.7,033 కోట్లు ఉంటుందని ఆర్థిక సంఘం లెక్క తేల్చింది. ఇదే కాలానికి పట్టణ స్థానిక సంస్థల రీసోర్స్‌ గ్యాప్‌ రూ.2,016 కోట్లుగా ఉందని, ఆస్తి పన్నుల డిమాండ్‌-కలెక్షన్‌ మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పింది.


విద్యుత్‌ బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం

గత ప్రభుత్వం 2024 జూన్‌ వరకు చెల్లించకుండా వదిలేసిన గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లులు రూ.5,851.58 కోట్లు ఉన్నాయని ఆర్థిక సంఘం తన నివేదికలో పేర్కొంది. గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ రూ.2,617 కోట్లుగా ఉందని, ఇందులో అత్యధికంగా కేంద్ర ఆర్థిక సంఘం అందిస్తున్న గ్రాంట్స్‌ రూపంలోనే ఉన్నాయని తెలిపింది. ఆతర్వాత ఆస్తి పన్నులతో ఎక్కువ నిధులు సమకూరుతున్నాయని పేర్కొంది. పంచాయతీరాజ్‌ సిబ్బందికి ఏటా జీతాల రూపంలో రూ.393. 77 కోట్లు, మున్సిపల్‌ సిబ్బందికి రూ.1672.45 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సంఘం తన నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలో రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం చైర్‌పర్సన్‌ రత్నకుమారి, సభ్యులు ప్రసాదరావు, కృపారావు, ఆర్థిక, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:51 AM