CM Chandrababu : ‘రియల్’ నిబంధనలు సరళతరం
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:53 AM
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని, దానికి అనుగుణంగా నిబంధనలు సరళతరం చేస్తున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పుంజుకునేలా చర్యలు
బిల్డర్లు, డెవలపర్లు నిబంధనలు పాటించాలి
2 రోజుల్లో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్
పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్ల జారీ
మీడియాతో మంత్రి నారాయణ
ఏపీ రెరాలో పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని, దానికి అనుగుణంగా నిబంధనలు సరళతరం చేస్తున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడలో ఉన్న రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి, రెరా చైర్మన్ కన్నబాబు, రెరా సభ్యులు, అధికారులతో కలిసి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘భవనాలు, ప్లాట్లు కొనుగోలు చేసేవారు తప్పుడు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం. బిల్డర్లు, డెవలపర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. రెరాలో ఇప్పటి వరకూ 167 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులొచ్చాయి. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. 30 మంది క్లయింట్లు, బిల్డర్లు, డెవలపర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చారు. దరఖాస్తుల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశాం. పెండింగ్ దరఖాస్తులన్నీ ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలనూ పరిశీలించాం. రెరా నిబంధనలు మరింత కఠినతరం చేసేలా కమిటీ వేసి ముందుకెళ్తాం. రెరా అనుమతులు ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో జరిగేలా త్వరలో మార్పులు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో బిల్డర్లు, డెవలపర్లుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. భవన నిర్మాణాలకు సంబంధించి కొత్తగా రూపొందించిన నిబంధనలను గురువారం జారీచేస్తాం. ప్రభుత్వానికి బిల్డర్లు సహకరించాలి.
నెలాఖరులోగా పెండింగ్ టీడీఆర్ బాండ్లు జారీ
గతంలో తణుకు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరగడంతో అన్ని చోట్ల బాండ్ల జారీ నిలిపేశాం. తాజాగా ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్లా పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్లను జారీ చేస్తున్నాం. తణుకులో టీడీఆర్ కుంభకోణంపై విచారణ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వాటిలో 321 టీడీఆర్‌ల వెరిఫికేషన్ పూర్తయింది. మరో 501 టీడీఆర్‌ల వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. విశాఖపట్నంలో 184, తిరుపతిలో 153, కర్నూలులో 93, గుంటూరులో 120, కాకినాడలో 91, రాజమండ్రిలో 50, కడపలో 46, విజయవాడలో 30తో పాటు ఇతర కార్పొరేషన్‌లలో మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా 822 టీడీఆర్‌లకు సంబంధించి ఈ నెలాఖరు కల్లా జారీ ప్రక్రియ పూర్తి చేస్తాం.
అక్రమ లేఅవుట్లపై స్పష్టత
రాష్ట్రంలో అనధికార లేఅవుట్లు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్న దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనడం ద్వారా కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు పడతారు. మరో వైపు భవన, లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం’’ అని మంత్రి చెప్పారు.